ఉమ్మడి రాజధాని..రుణమాఫీ అంశాలపై ఆంక్షలు
ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులుపై కేబినెట్‌లో చర్చించే అవకాశం
విధాత, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో మంత్రి వర్గ సమావేశం సోమవారం జరగనున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అకాల వర్షాలు రైతులను కోలులేని విధంగా దెబ్బతీశాయి. తడిసిన ధాన్యం కల్లాల్లోనే ఉండటం, కొనుగోళ్లలో జాజ్యం జరుగుతుండటంపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరానికి ప్రారంభానికి ముందే పాఠశాలలు, కాలేజీల్లో చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై క్యాబినెట్ ప్రధానంగా చర్చించనున్నది. రైతు రుణమాఫీ, ఏపీ, తెలంగాణ విభజన అంశాలను చర్చించాలని భావించినా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జూన్ 4 వరకు వాటిని పక్కనపెట్టాలని ఈసీ షరతులు విధించింది. జూన్ 4లోపు చేపట్టాల్సిన అత్యవసర పనులపై మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు క్యాబినెట్ భేటీకి హాజరు కావొద్దని ఈసీ తెలిపింది.
ఎన్నికల సంఘం అనుమతి రావడంతో నేడు మధ్యాహ్నం 3గంటలకు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొదట ఎన్నికల కోడ్ నేపథ్యంలో శనివారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతినివ్వలేదు. దీంతో సోమవారం వరకు అనుమతి కోసం వేచి చూసి, అనుమతి రాకపోతే రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలిసి అనుమతి కోరాలని సీఎం నిన్న నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సీఈసీ తెలంగాణ కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హామీలపై చర్చించాలనుకున్నా ఈసీ ఆంక్షలతో వాయిదా
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలపై హామీ ఇచ్చింది. వాటిలో ఐదింటిని ఇప్పటికే అమలు చేశామని ప్రభుత్వం చెబుతున్నది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన రైతు రుణమాఫీని కూడా అమలు చేయాలని సీఎం కృత నిశ్చయంతో ఉన్నారు. మాట ఇచ్చాను కాబట్టి ఆగస్టు 15 నాటికి మాఫీ చేయాల్సిందేనని ఉన్నతాధికారులతో భేటీలో స్పష్టం చేశారు. దీనికి సంబంధించి బ్యాంకర్లతోనూ మాట్లాడాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఈసీ దీనిపై షరతులు విధించడంతో జూన్ 4 తర్వాతే దీనిపై చర్చించనున్నారు.
అలాగే విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం జూన్ 2 నాటికి ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధాని గడువు పూర్తి కానున్నది. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా విభజన సమస్యలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా 9, 10 షెడ్యూల్‌లోని సంస్థలపై ఇంకా పంచాయీతీ ఎటూ తేలలేదు. అపరిష్కతంగా ఉన్న విభజన అంశాల పరిష్కారం కోసం ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన పద్ధతులపై క్యాబినెట్‌లో చర్చించాలని భావించారు. కానీ దీనిపై కూడా ఈసీ చర్చించకూడదని పేర్కొనడంతో జూన్ 4 వరకు చేపట్టాల్సిన అత్యవసర పనులపై మాత్రమే క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.