Warangal | ఫిరాయింపులే కడియం బ్రాండ్ : తాటికొండ రాజయ్య

పార్టీ ఫిరాయించి కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేయనంటున్న కడియం శ్రీహరికి అనర్గత వేటు తప్పదంటూ.. బహిష్కరణే  ఆయనకు సరైందని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య జోస్యం చెప్పారు.

 విధాత, వరంగల్ ప్రతినిధి:
పార్టీ ఫిరాయించి కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేయనంటున్న కడియం శ్రీహరికి అనర్గత వేటు తప్పదంటూ.. బహిష్కరణే  ఆయనకు సరైందని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య జోస్యం చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును రాజ్యాంగాన్ని స్పీకర్ ను  కడియం శ్రీహరి కించపరుస్తున్నారని ఆరోపించారు. హనుమకొండలో మంగళవారం మీడియా సమావేశంలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి మాట్లాడారు. ‘స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి పిచ్చి లేసినట్టు మాట్లాడుతున్నాడన్నారు. ఆయన ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారు… పూటకో మాట మాట్లాడుతూ… ఏ రోటి కాడ ఆ మాట మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ… రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ…ఏమాత్రం నైతిక విలువలను పాటించకుండా పార్టీ ఫిరాయించి, ఇప్పుడు ఉల్టా మాట్లాడుతున్నా’ అని మండిపడ్డారు.
రాజ్యాంగం, సుప్రీంకోర్టు, స్పీకర్ ను కించపరిస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. పైగా రాజీనామా చేయడం లేదంటూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తమ రక్తం చెమటగా మార్చి, ఆ పార్టీ మేనిఫెస్టో ముందు పెట్టుకుని, బీఆర్ఎస్ ఫండ్ తో గెలిచిన కడియం ఈరోజు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయోనని ఆయన వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు జరిగితే డిపాజిట్ రాదని కడియం భయపడుతున్నారని విమర్శించారు. కడియం వెంట ఏ ఒక్క నిజమైన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు లేరని, అంతా డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులే ఉన్నారని ఎద్దేవా చేశారు.
 గతంలో తాను అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాజన్నగా రాష్ట్రమంతా తిరిగానని గుర్తు చేశారు. తనకు బ్రాండ్ ఉందని చెప్పుకునే కడియం శ్రీహరికి ఉన్నదల్లా పార్టీలు ఫిరాయించే బ్రాండే అన్నారు. ప్రధాని మోదీ పిలిచి తన బిడ్డకు మంత్రి పదవి ఇస్తానంటే బిజెపిలోకి కూడా కడియం వెళ్తాడని విమర్శించారు. మూడు దశాబ్దాల కాలంలో ఘనపూర్‌కుగాని, జిల్లాకు గాని కడియం చేసిందేమీ లేదన్నారు. తనకు తానే నీతిమంతుడు అని చెప్పుకునే కడియం శ్రీహరి దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారని గ్రామాల్లో కనీసం తిరిగే పరిస్థితి లేదని అన్నారు. కడియం శ్రీహరి అంత నీతిమంతుడు అయితే రెండు సంవత్సరాలు చేసిన అభివృద్ధి పైన శ్వేత పత్రం విడుదల చేయాలని రాజయ్య సవాల్ విసిరారు.

 నవంబర్ 29 నుంచి దీక్షా దివస్: వినయ్

నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 తేదీ వరకు తెలంగాణ దీక్షా దివస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ వివరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించేందుకు, ఈ తరానికి కూడా తెలియజేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. కేసీఆర్ స్ఫూర్తిని చాటిచెప్పే విధంగా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, ఇతరత్రా పండ్లు పంపిణీ తదితర సమాజహిత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీక్ష దివస్ ఉత్సవాల జయప్రదానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 26న సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. బుధవారం ఉదయం హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని వివరించారు. ఈ మీడియా సమావేశంలో నాగూర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News