విధాత, హైదరాబాద్ :
ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు తనపై చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. తాను నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదని.. నువ్వే లిక్కర్ రాణి అని పిలిపించుకున్నావు అని కవితను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు ఎత్తకపోతే బోనమే లేనట్టు, నువ్వు ఆడక పోతే బతుకమ్మే లేనట్టు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావు అని ధ్వజమెత్తారు. సోమవారం మీడియాతో మాట్లాడిన కవిత కౌంటర్ వేశారు. ఓట్ల కోసం తండాల్లో తిరుగుతుంటుంటే.. మీ కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే ఏం కాదు కానీ.. మేము సారా కాస్తే అరెస్టు చేయిస్తారా అని తనను లంబాడా మహిళలు నిలదీశారని తెలిపారు.
కేసీఆర్ కూతురు కాబట్టే నీకు ఇంకా గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నామని.. ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవడం లేదని కవితను విమర్శించారు. తాము కేసీఆర్ కు మంచి పేరు తెస్తుంటే.. ఆయనను మానసికంగా వేధిస్తున్నావని దుయ్యబట్టారు. ఎవరిని సంతోషపెట్టడానికి కవిత నాపై ఆరోపణలు చేస్తుందని ప్రశ్నించారు. నీ అహంకారం.. చర్యలు కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు. నాకు ఒక్క వ్యవసాయ క్షేత్రం మాత్రమే ఉంది.. గండిపేటలో విలాసవంతమైన ఫామ్ హౌస్ లేదా? అన్ని పైసలు ఎక్కడివి? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
తండ్రి వయసు ఉన్న ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించుకుని.. జాగృతిలో చేరాలని కవిత అడిగిందన్నారు. ఒప్పుకోని నా లాంటి వాళ్ల మీద ఆరోపణలు సరికాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాగా, వనపర్తిలో జాగృతి జనం బాటలో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. మాజీ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పిచ్చిపిచ్చిమాటలు మాట్లాడితే పుచ్చలు లేచిపోతాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో నిరంజన్ రెడ్డి అవినీతి పరాకాష్టకు చేరుకుందని ఆరోపించారు. దీనిపై స్పందించిన నిరంజన్ రెడ్డి కూడా కవితపై అదే స్తాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు కేసీఆర్ కూతురుగా కవితను బీర్ఎస్ నేతలు ఎలాంటి మాటలు అనలేదు. తాజాగా నిరంజన్ రెడ్డి కవితను విమర్శంచడంతో అది చెరిగిపోయింది. ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి విమర్శలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
