Mahabubnagar : అంత్యక్రియలు చేయలేక..కొడుకు మృతదేహంతో స్మశానంలో తండ్రి వేదన

డబ్బులు లేక కొడుకు మృతదేహంతో స్మశానంలో 8 గంటలు ఏడ్చిన మహబూబ్‌నగర్‌ బాలరాజ్ వేదన హృదయాన్ని కలచేసింది. చివరకు వీఆర్‌ సేవకులు వచ్చి అంత్యక్రియలు చేశారు.

Mahabubnagar Emotional Story

విధాత : బ్రతికి ఉన్నప్పుడు తిండి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నానంటూ ఓ నిరుపేద తండ్రి చనిపోయిన కొడుకు మృతదేహంతో స్మశానంలోనే 8గంటల పాటు దీనంగా కంటతడి పెట్టిన ఘటన మనసున్న మనుషులను సైతం వేదనకు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో పత్తి మిల్లులో పని చేస్తూ భార్య, ఇద్దరు కుమారులను పోషిస్తూ జీవనం సాగించిన బాలరాజ్ అనే వ్యక్తి కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక స్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్నాడు. ఇటీవల పత్తి మిల్లు మూతపడి ఉపాధి కోల్పోవడంతో, భర్త, దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని వదిలేసి, చిన్న కుమారుడితో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో బాలరాజ్ స్థానికంగా హోటల్లో పని చేస్తూ పెద్ద కుమారుడు హరీష్(8)ని పోషిస్తున్నాడు. ఇటీవల అతన తీవ్ర అనారోగ్యంతో అతను మృతి చెందాడు.

కొడుకు అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక, స్మశానంలో మృతదేహాన్ని పట్టుకుని 8 గంటలపాటు బాలరాజు ఏడుస్తూ కూర్చున్నాడు. బ్రతికి ఉన్నప్పుడు తిండి పెట్టలేకపోయానని.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోతున్నాను అంటూ కన్నీరు పెట్టుకుంటూ సహాయం కోసం ఎదురు చూశాడు. చివరకు కొంత మంది జడ్చర్లకు చెందిన వీఆర్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో.. సంస్థ ప్రతినిధి ప్రవీణ్‌.. వాలంటీర్లతో సాయంత్రం 7 గంటలకు చేరుకొని పొక్లెయిన్‌తో గుంత తీయించి.. ఖననం చేశారు. ఈ సందరబ్ంగా బాలరాజ్ రోధిస్తూ తన గోడు వెళ్లబోసుకున్నాడు. 4 రోజులుగా ఆహారం లేక ఇద్దరం నీరు తాగే ఉన్నామని, తాను కూడా జాండీస్ కు గురయ్యానని బాలరాజ్ వెల్లడించాడు. బాలరాజు కష్టాలు తెలుసుకున్న వారంతా చలించిపోయారు.

Latest News