మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్ర

రైతు భరోసా నిధులను కొద్ది మంది రైతులకు పరిమితం చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మంత్రి వర్గం ఉప సంఘం పేరుతో కుట్ర చేస్తుందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

  • Publish Date - June 22, 2024 / 04:21 PM IST

నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. కేసీఆర్‌ను మళ్ళీ సీఎంను చేయడమే నా లక్ష్యం
మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు

విధాత : రైతు భరోసా నిధులను కొద్ది మంది రైతులకు పరిమితం చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మంత్రి వర్గం ఉప సంఘం పేరుతో కుట్ర చేస్తుందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతాంగం గొంతు కోయడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని అన్నట్టుగా ఉందని, ఎన్నికల ముందు అనేక హామీలతో ప్రజలను నమ్మబలికి మోసం చేశారన్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి ఆగస్టు 15కు మార్చారని, హామీల అమలులో కాలయాపన చేయడం, కేసీఆర్‌ను విమర్శించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా మారిందని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో రుణమాఫీ కాకుండా మిగిలింది 4,000 కోట్ల రూపాయలు మాత్రమేనని, కేసీఆర్ హయాంలో జరిగిన రుణమాఫీని తక్కువ చేసి సీఎం రేవంత్‌రెడ్డి చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఐదెకరాల భూమి ఉన్న రైతుల సంఖ్య 92 శాతం మాత్రమే ఉందని, ఐదెకరాలోపు ఉన్న రైతులకు లక్షకు మించి ఏ బ్యాంకు పంట రుణం ఇవ్వదన్నారు. 2 లక్షల రూపాయల పంట రుణాలు ఎంత మందికి ఉన్నాయో వివరాలు రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే రుణమాఫీ జరిగినట్టే కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

వానాకాలం రైతుబంధు ఇప్పటికే రైతుల ఖాతాల్లో పడాలని, రేవంత్ ప్రభుత్వం వచ్చి మూడు సీజన్లు అవుతోందని, రైతు భరోసా కాదు కదా రైతు బంధు కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్‌లైన్ పెట్టారని, అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుందని.. సీజన్ అయిపోయాక రైతు భరోసా ఇస్తారా? అని నిలదీశారు. రైతు భరోసాకు అర్హులెవరో ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదన్నారు. 68.90 లక్షల మందికి 1.52 కోట్ల ఎకరాలకు 11 విడతల్లో 72 వేల కోట్ల రూపాయలను కేసీఆర్ హయాంలో రైతు బంధు కింద ఇచ్చామని, 2,603 క్లస్టర్‌లు రాష్ట్రంలో ఉన్నాయని, ప్రతి క్లస్టర్‌లో 5 వేల ఎకరాలు ఉంటాయని, డాటా అంతా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందని, రైతు భరోసాకు మంత్రివర్గ ఉపసంఘం వేయడం కుంటి సాకు మాత్రమేనని ఆరోపించారు.

ఈ ఆధునిక యుగంలో లబ్ధిదారులను ఎంపిక చేయడం ఓ గంట పని మాత్రమేనన్నారు. మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కొద్ది మందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెర లేపారని ఆరోపించారు. రైతు భరోసాకు పట్టాదార్ పాస్ పుస్తకాలే ప్రామాణికం కావాలని, రెవెన్యూ రికార్డులు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయని, వాటి ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు బంధు గుట్టలున్న చోట ఇచ్చారని దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, కేసీఆర్ హయాంలో 4.5 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి వెచ్చించామని తెలిపారు. కేసీఆర్ తీసుకున్న చర్యలతో రైతాంగం బాగుపడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందన్నారు.

 

సాకులు చెప్పి రైతులకు సాయాన్ని ఎగ్గొట్టే కుట్రకు ఈ ప్రభుత్వం తెరలేపుతోందని, 25 ఎకరాలకు పై బడి ఉన్న రైతులు 6,500 మందికి మించి లేరని, ఒక్క ఎకరా కూడా పడావుగా ఉండకూడదనే తపనతో కేసీఆర్ ఆనాడు కేసీఆర్ రైతు బంధు ప్రవేశ పెట్టారన్నారు. తెలంగాణలో ప్రతి ఇంచి భూమి సాగుకు అనువైనదేనని, అప్పుడు ఏడాదిలో మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఒక్కసారి కూడా సరిగా ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం నియోజకవర్గం కొడంగల్‌లో కూడా నకిలీ విత్తనాల దందా వెలుగులోకి వచ్చిన వైనం రేవంత్ అధ్వాన్నపాలనకు నిదర్శనమన్నారు.

కేసీఆర్‌ను మళ్ళీ సీఎంను చేయడమే నా లక్ష్యం : ఎర్రబెల్లి దయాకర్‌రావు

నేను పార్టీ మారే ప్రసక్తే లేదని, కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడమే నా లక్ష్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉండగా, ఇప్పుడు రైతులు ఎంత ఆందోళనలో ఉన్నారో ఓసారి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించుకోవాలన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుండాలని దుయ్యబట్టారు. అన్ని విషయాల్లో రైతుల పరిస్థితి ఘోరంగా మారిందన్నారు. రైతులకు సాయం అనే సరికి కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు, షరతులు పెడుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. పాత కాంగ్రెస్ ప్రభుత్వ రోజులు మళ్ళీ వచ్చాయని, ఇదే రేవంత్ రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల సమస్యలపై ధర్నాలు చేశారని, అలాంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దన్నారు.

పోచారం లక్ష్మీపుత్రుడు కాదు..లంక పుత్రుడు : మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్‌తో లక్ష్మీపుత్రుడని పిలిపించుకున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి లంక పుత్రుడుగా మారాడని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. పోచారం గురించి అతని కుటుంబ సభ్యుల గురించి దండుపాళ్యం మూట అంటూ మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సిగ్గులేకుండా ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడని దుయ్యబట్టారు. బీఆరెస్ పార్టీలో మంత్రి, స్పీకర్ వంటి ఉన్నత పదవులు పొంది, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తీసుకోని రీతిలో బాన్స్‌వాడ నియోజకవర్గానికి 7,500కోట్ల నిధులు తీసుకెళ్లాడని, 12వేల ఇండ్లు కట్టించుకున్నాడని, పార్టీలో అన్నిరకాలుగా లబ్ధి పొంది తల్లి రొమ్మును గుద్ధిన రీతిలో పోచారం ఉసరవెల్లిలా పార్టీ మారిపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడన్నారు.

గతంలో సీఎం కేసీఆర్‌ను ప్రాణమున్నంత వరకు నువ్వే మా నాయకుడని కొనియాడిన పోచారం ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిని మరో 20ఏండ్లు సీఎంగా ఉండాలంటున్నారని, కేసీఆర్‌ను మోసం చేసినట్లుగానే రేపు రేవంత్‌రెడ్డిని కూడా పోచారం మోసం చేస్తాడన్నారు. పోచారం రాష్ట్రానికి విషచారంగా మారిండన్నారు. గతంలో పార్టీ మారిన వారికి ఉరిశిక్ష వేయాలని, రాళ్లతో కొట్టాలని, వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు పక్క పార్టీ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం లేకుండా బతుకలేనని, బందైపోయిన క్రషర్లు, ఇసుక దందాలు తిరిగి కొనసాగించేందుకు నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకే పోచారం కాంగ్రెస్‌లో చేరాడే తప్ప రైతుల కోసం చేరలేదని విమర్శించారు.

Latest News