Site icon vidhaatha

G. Jagadish Reddy | గురుకుల సమస్యలను పరిష్కరించలేక బీఆరెస్ పాలనపై నిందలు : మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి

విజ్ఞత కోల్పోయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కష్ట ఫలమే

విధాత, హైదరాబాద్ : గురుకుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞత కోల్పోయి గత బీఆరెస్ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జగదీశ్‌రెడ్డి రాష్ట్రంలోని గురుకుల హాస్ట‌ళ్ల‌లో విషాహారం తిని పిల్ల‌లు చ‌నిపోతుంటే, వంద‌లాది మంది ఆస్ప‌త్రి పాల‌వుతుంటే ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేకపోగా దీనికి కూడా కేసీఆర్, కేటీఆర్ కారణమని భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి భాష మాట్లాడితే, ఆయ‌న లాగా అబద్దాలు మాట్లాడితేనే సీఎం అవుతాన‌ని భ‌ట్టి విక్ర‌మార్క‌ అనుకుంటున్నారేమోనని.? పాపం సీఎం కాకపోగా ఉన్న గౌర‌వం పోత‌దని చురకలేశారు. హాస్ట‌ల్స్‌లో అప‌రిశుభ్ర‌త‌కు బీఆరెస్ కార‌ణ‌మ‌ని మాట్లాడుతున్నారని, మేం 9 నెల‌ల కింద వండిన భోజ‌నాన్ని మీరు ఇప్పుడు పెడుతున్నారా..? అని భ‌ట్టిని ప్ర‌శ్నించారు. నువ్వు ముఖం క‌డుక్కోకుండా మీరు కార‌ణ‌మ‌ని మాట్లాడ‌డం స‌రికాద‌ని ఎద్దేేవా చేశారు.

కేసీఆర్ కష్టఫలమే సీతారామ ప్రాజెక్టు

సీతారామ ప్రాజెక్టు నిర్మాణ ఘనత ముమ్మాటికి మాజీ సీఎం కేసీఆర్ కష్ట ఫలితమేనని, ఇందులో మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలలో తప్పు లేదని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. హ‌రీశ్‌రావు మాటల పట్ల మంత్రి తుమ్మల బాధ‌ప‌డుతుండటం విడ్డూరమన్నారు. సీతారామ ప్రాజెక్టు ప‌నులు 90 శాతం పూర్తి చేశామని, బ‌ట‌న్ నొక్కే అదృష్టం మీకొచ్చిందని ,మీరు అదృష్ట‌వంతులు అని హ‌రీశ్‌రావు చెప్పారన్నారు. బ‌ట‌న్ నొక్కేట‌ప్పుడు ఇది కేసీఆర్ క‌ష్టం అని చెప్పాల‌ని ఒక మాట సూచించారన్నారు. దానికి ఉలిక్కిప‌డి అన్ని అనుమ‌తులు మేమే తెచ్చామని కాంగ్రెస్ మంత్రులు ఊదరగొడుతున్నారన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు కూలిపోయాయన్న కాంగ్రెస్ పాలకులు కళ్ల ముందే సుంకిశాల ప్రాజెక్టు కూలిన చర్యలు ఎందుకు తీసుకోలేదని జగదీశ్‌రెడ్డి నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి పది రోజులు విదేశాల్లో తిరిగి రాష్ట్రానికి వచ్చి కేటీఆర్ గతంలో తెచ్చిన కంపనీ విస్తరణ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేయడం, మేం ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలివ్వడం కాంగ్రెస్ విఫల పాలనకు నిదర్శనమన్నారు. సీతారామ ప్రాజెక్టుపై అన్ని అనుమతులు బీఆరెస్ హయంలో తెచ్చినవేనని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క అనుమతి తెచ్చారా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పాలన్నారు. కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే సోయే లేకపోగా, కేసీఆర్ అప్పగించాడని ప్రచారం చేశారన్నారు. చివరకు నల్లగొండ సభతో కేసీఆర్ కృష్ణా ప్రాజెక్టులపై గర్జిస్తే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్న సంగతి ప్రజలంతా చూశారన్నారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ మంత్రులకు అవగాహాన లేదనని విమర్శించారు.

సీతారామపై మంత్రుల మాటలు అవగాహాన రాహిత్యమే

సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ అంచనాలు పెంచారని కాంగ్రెస్ మంత్రుల ఆరోపణలు అవగాహాన లేనివని జగదీశ్‌రెడ్డి తప్పబట్టారు.19వేల కోట్ల అంచనా వ్యయంలో సీతారామ ప్రాజెక్టు, బ్యారేజీ, లిఫ్టు, హైడ్రల్ ప్రాజెక్టు కలిపే ఉన్నాయన్నారు. మీ హయంలో చేసినట్లుగా ప్రారంభంకాని పనులకు కూడా పది పదిహేను రేట్లు పెంచుకుంటు పోయి, కమిషన్లు తీసుకోవడంలో మీ కాంగ్రెస్ మంత్రులకే అలవాటన్నారు. సీతారామ ప్రాజెక్టులో 2018నుంచి మొదలు పెడితే అనేక డైరక్టర్‌ల అనుమతులు తీసుకుని పనులు జరిపించామన్నారు. మీలాగా జల యజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేయలేదన్నారు. ప్రాజెక్టులు మొదలుపెట్టకుండానే కాలువలు తవ్వక ముందే మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చి.. కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు తీసుకున్నచరిత్ర కాంగ్రెస్ మంత్రులదే.. ప్రభుత్వాలదేన్నారు. ఆనాడు మీ మహారాష్ట్ర సీఎం అలాంటి ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కమిషన్లకు కక్కురి పడి ప్రాణహిత చేవెళ్ల ఒక్క ప్రాజెక్టుకు 16చోట్ల ఫౌండేషన్ వేసిన చరిత్ర మీదన్నారు. మీ అలవాట్లు కేసీఆర్ చేసినట్లుగా పచ్చకామెర్ల వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఎప్పుడు మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వలేదన్నారు. తెలంగాణకు మాజీ సీఎంలు వైఎస్సార్‌, చంద్రబాబులు సాగునీటి రంగంలో చేసిందేమి లేదన్నారు. 350టీఎంసీల ప్రాజెక్టులను పూర్తి చేసుకుని కృష్ణా నీటిని తరలించుకుపోయే కుట్రలనే వారిద్ధరు అమలు చేశారన్నారు. తెలంగాణకు మూడున్నర టీఎంసీల చెరువు కూడా నిర్మించలేదన్నారు. దీనిపై ఎలాంటి చర్చకైనా సిద్ధమన్నారు. ఉన్నమాట అంటే కాంగ్రెస్ మంత్రులు ఏడుపులు, పెడబొబ్బలు శాపనార్ధాలు పెడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలు నింపే పరిస్థితి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని, నీళ్లిస్తే ధాన్యం పండితే కొనలేమని, బోనస్ ఇవ్వలేమని రైతులకు నీళ్లివ్వడం లేదని ఆరోపించారు. ఎస్‌ఎల్బీసీ, ఎస్సార్‌బీసీ ఒకేరోజు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టు పూర్తయి 30ఏల్ల నుంచి నీళ్లందిస్తుంటే ఎస్‌ఎల్బీసీ ఎందుకు పూర్తి కాలేదో కాంగ్రెస్ పాలకునే చెప్పాలన్నారు. అక్కడ పెట్టిన టీబీఎంలు ఇక్కడ ఎందుకు పెట్టలేదో ఎవడు దొంగనో మంత్రులు చర్చకు రావాలన్నారు.

హామీల అమలులో కప్పదాట్లే

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను పాలించిన కిర‌ణ్ రెడ్డిదే బ‌ల‌హీన ప్ర‌భుత్వం అనుకున్నామని, కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంత‌కు మించిన బాధ్య‌త‌రాహిత్య పాల‌న వ‌చ్చింద‌ని జ‌గ‌దీశ్ రెడ్డి విమ‌ర్శించారు. గ‌డిచిన ఎనిమిది నెలల కాలంలో వీధుల్లో పిచ్చి కుక్కలు ప్రజల్ని కరుస్తుంటే, కనకపు సింహాసనాల మీద కూర్చున్నవేమో ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రశ్నిస్తే ప్రతి పక్షాన్ని కరుసున్నాయంటూ జ‌గ‌దీశ్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కాంగ్రెస్ నేత‌ల‌కు హామీలు ఇచ్చుడు, ఒట్లు పెట్టుడు ఒడిసిపోయాయనన్నారు. ఉన్న‌మాటంటే ఉలిక్కిప‌డుతున్న కాంగ్రెస్‌ మంత్రులు భుజాలు త‌డుముకుని స‌మాధానాలు చెప్ప‌లేక ఏడ్చే ప‌రిస్థితి వ‌చ్చిందన్నారు. పాలన చివ‌రి రోజుల్లో ఏడుపుల పరిస్థితి వస్తదనుకున్నామని, కాంగ్రెస్ పాలకులకు ప్రారంభంలోనే ఈ ప‌రిస్థితి త‌లెత్తిందని ఎద్దేవా చేశారు. ఒక ప‌రిపాల‌కుడికి 9 నెల‌లు అనేది త‌క్కువ స‌మ‌యం కాదని, ప‌థ‌కాల అమ‌లుకు డెడ్‌లైన్లు పెట్టుకున్నారని కానీ డెడ్‌లైన్లు అయిపోయినా ప‌థ‌కాలు అమ‌లు కాలేదన్నారు. ఇప్పుడు మాట మార్చి మాట్లాడుతున్నారని, రుణ‌మాఫీ విష‌యంలో రూ. 41 వేల కోట్లు అని చెప్పి, రూ. 39 వేల కోట్ల‌కు తెచ్చారు. దాన్ని రూ. 36 వేల కోట్లు చేసి, ఆఖ‌రికి రూ. 12 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అని జ‌గ‌దీశ్ రెడ్డి మండిప‌డ్డారు. మీరు ఎన్ని స్టోరీలు రాసుకున్నా. రాయించుకున్నా ప్ర‌జ‌ల జేబుల్లోకి పైస‌లు పోవ‌డం లేదని స్పష్టం చేశారు.

Exit mobile version