హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. మరికాసేపట్లో ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇంద్రకరణ్ రెడ్డి రాజకీయ ప్రస్థానం..
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ పట్టా పుచ్చుకున్న ఇంద్రకరణ్ రెడ్డి 1980లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1987 నుంచి 1991 వరకు జిల్లా పరిషత్ చైర్మన్‌గా సేవలందించారు. 1991 నుంచి 1996 వరకు ఎంపీగా కొనసాగారు. 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2014లో బీఎస్పీ నుంచి గెలుపొంది, టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో బీఆర్ఎస్ తరపున నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ, అటవీశాఖ మంత్రిగా పని చేశారు. 2023 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.