Site icon vidhaatha

T. Harish Rao | రంగనాయక్ సాగర్ జల సోయగంతో పులకరించాను : మాజీ మంత్రి టి.హరీశ్‌రావు

విధాత : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక్ సాగర్ జలాశయం గోదావరి జలాలతో నిండుకుంటున్న జల దృశ్యం చూసి నా మనసు పులకరించిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని రంగ‌నాయ‌క సాగ‌ర్ ప్రాజెక్టుకు గోదావ‌రి జ‌లాలు ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్నాయి. ఈ ప్రాజెక్టులోకి గోదావ‌రి జ‌లాల ఎత్తిపోత‌ల‌ను హ‌రీశ్‌రావు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. రైతుల‌కు నీరందించాల‌నే నిత్య త‌ప‌న‌కు ఈ ప్రాజెక్టు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. అన్నదాత‌ల ఆనంద‌మే, వారి ముఖాల్లో చిరున‌వ్వే ల‌క్ష్యంగా బీఆరెస్‌ ప్ర‌భుత్వం ప‌ని చేసింద‌న్నారు. ఈ జ‌ల‌దృశ్యాన్ని చూస్తుంటే మ‌న‌సు పుల‌క‌రించిపోతోంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్‌-2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయని, దిగువన పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి అండర్‌ టన్నెళ్ల ద్వారా నందిమేడారంలోని నంది పంప్‌హౌస్‌కు జలాలు చేరుతుండగా, శనివారం ఒక మోటర్‌ ద్వారా 3,150 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్‌ జిల్లా లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిపోతున్నాయి. ఇక్కడ కూడా ఒకే మోటర్‌ నడిపిస్తున్నారు. మొత్తం 3,150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు ఎల్లంపల్లి నుంచి 13 టీఎంసీలకుపైగా జలాలు మధ్య మానేరుకు తరలించినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మధ్యమానేరు జలాశయంలో 27.54 టీఎంసీల నీటి సామర్థ్యానికిగాను ప్రస్తుతం 17.06 టీఎంసీల నీటి నిలువ ఉన్నట్టు అధికారులు తెలిపారు. మధ్యమానేరు నుంచి సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తున్నారు. మధ్యమానేరు నుంచి అండర్‌ టన్నెళ్ల ద్వారా తిప్పాపూర్‌లోని సర్జ్‌పూల్‌కు జలాలు చేరుతుండగా, ఇక్కడ పంప్‌హౌస్‌లో రెండు బాహుబలి మోటర్ల ద్వారా 6,440 క్యూసెక్కులు అన్నఫూర్ణ జలాశయానికి చేరుకుంటున్నాయి.

Exit mobile version