బీఆర్ఎస్ హయంలో తీరని నష్టం
ప్రాణహిత చేవెళ్ల కట్టి తీరుతాం
ప్రణాళిక బద్ధంగా ప్రాజెక్టుల నిర్మాణం
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
Uttam Kumar Reddy | విధాత, ప్రత్యేక ప్రతినిధి : బనకచర్లను అడ్డుకొని తీరుతామని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హరీశ్ రావు అబద్దాలతో, అసత్య ప్రచారాలతో గందరగోళం సృష్టించవద్దని హితవు పలికారు. శనివారం హనుమకొండలో ఆయన మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను స్వయంగా కలవడంతో పాటు లిఖితపూర్వకంగా తెలంగాణ రాష్ట్రం పక్షాన అభ్యంతరాలను తెలియపరిచామని చెప్పారు. ఆల్మట్టి ఎత్తును సమర్థించే ప్రసక్తే లేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. కృష్ణా, గోదావరి జలాలలో తెలంగాణాకు నష్టం జరిగిందంటే అది బీఆర్‌ఎస్ పాలనలోనేనని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావులు కలిసి కృష్ణా జలాలలో ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీల నీటి వినియోగానికి ఒప్పందం కుదుర్చుకున్నారని మండిపడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తూ, రాజకీయ దురుద్ధేశంతో హరీశ్ రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కట్టిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం కుప్ప కూలిందన్నార. మెడిగడ్డ కూలిపోయిందని, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ లకు బుంగలుపడి నిరుపయోగంగా మారాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారినప్పటికీ148.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి జరిగి దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాగు అయిన మూడు పంటలు దిగుబడిలో అధిక ఉత్పత్తి సాధించిన తీరు ప్రభుత్వ పనితీరును ప్రతిబింబిస్తుంది తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మిస్తామని చెప్పిన బీఆర్ఎస్ పాలకులు అక్కడ తట్టెడు మట్టి ఎత్తలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుందన్నారు. తమ్మిడిహట్టి వద్ద చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు కట్టి తీరుతామని చెప్పారు. సమ్మక్క-సారక్క ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు సాధిస్తున్నామన్నారు. సీతారామ ప్రాజెక్టు కు 65 టీఎంసీల నీటి కేటాయింపులు సాధించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ బలరామ్ నాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.