Cyber Frauds | టీజీసీఎస్బీ! రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి పనిచేస్తున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో! ఇక్కడ సాధారణంగా సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు అధికంగా నమోదవుతుంటాయి. ఆన్‌లైన్‌లో తమను వేధిస్తున్నారనే కేసులూ ఉంటాయి. అయితే.. సైబర్ మోసాల తర్వాత అత్యధిక కేసులు మాత్రం ఒకే ఒక అంశంలో నమోదు కావడం విశేషం. అవే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అభ్యంతరకర పోస్టులపై కేసులు. ఈ ఏడాది ఇప్పటి వరకూ నమోదైన 107 కేసులలో సగం స్టాక్‌మార్కెట్ స్కామ్‌లకు సంబంధించినవి కాగా.. తదుపరి పెద్ద భాగం.. 15 శాతం కేసులు సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వంపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించినవి కావడం విశేషం. మానవ అక్రమరవాణా, డిజిటల్ అరెస్టు, చిన్నాచితక ఆన్‌లైన్ మోసాలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల కంటే ఇవే ఎక్కువగా ఉన్నాయి.
2025లో ఇప్పటి వరకూ ఏడు సైబర్ పోలీస్ స్టేషన్లలో 107 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అందులో 46 శాతం (50 ఎఫ్‌ఐఆర్‌లు) స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌లకు సంబంధించినవి. పెట్టిన పెట్టుబడిపై ఆకర్షణీయ రిటర్న్స్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేసినవి. ఆ తర్వాతి స్థానంలో ముఖ్యమంత్రిపై చేసిన అభ్యంతకర పోస్టులకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలో మొత్తం ఏడు పోలీస్ స్టేషన్లకు గాను ప్రతి స్టేషన్‌లోనూ కనీసం ఒక కేసు ఉన్నది. ఖమ్మం పోలీస్ స్టేషన్‌లో నాలుగు, వరంగల్‌లో, సిద్దిపేట, రామగుండం పోలీస్ స్టేషన్లలో మూడు చొప్పున, కరీంనగర్‌లో రెండు, నిజామాబాద్, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో ఒకటి చొప్పున నమోదయ్యాయి. మొత్తం 17 కేసులలో పది సుమోటో కేసులే. సోషల్ మీడియాను మానిటర్ చేసే కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇవి నమోదయ్యాయి. నాలుగు కేసులు కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్లు, టీపీసీసీ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుల మేరకు నమోదైనవి. మూడు కేసులను ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ప్రభుత్వ మేలు కోరేవారు నమోదు చేయించినవి. ఈ కేసులన్నీ మార్చి 3వ వారం తర్వాతే నమోదు కావడం విశేషం.
రేవంత్‌రెడ్డిపై పోస్టులకు సంబంధించిన ఏ కేసులోనూ ఇప్పటి వరకూ నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదు. అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితులకు సంబంధించిన వివరాల కోసం సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలకు లేఖలు రాసినట్టు ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులు తెలిపారు. అభ్యంతరకర పోస్టులకు సంబంధించిన నిందితుల సమాచారం ఇవ్వాలని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాలను ఆదేశించాలని కోరుతూ తాము కోర్టుకు కూడా విజ్ఞప్తి చేశామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.