విధాత, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కౌన్సిల్(GHMC Council Meeting) ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలంలో చివరి సమావేశం(last meeting) మేయర్ విజయలక్ష్మి(Mayor Vijayalakshmi) అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైంది. 2028 ఫిబ్రవరి 11తో జీహెచ్‌ఎంసీ పాలకవర్గం గడువు ముగిసిపోనుంది. జనవరిలో బడ్జెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు కౌన్సిల్ మీటింగ్‌కి నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 95 ప్రశ్నలు, 45 ఎజెండా అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.
ప్రస్తుత పాలకవర్గం గత ఐదేళ్లలో పారిశుద్ధ్యం సమస్యలపై దారుణంగా విఫలమైందని ఆరోపిస్తూ..బీజేపీ(bjp) కార్పోరేటర్లు చేతులకు సంకెళ్లు, నోటికి నల్లగుడ్డలు ధరించి.. దున్నపోతుతో నిరసన వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సమావేశానికి వచ్చారు. నగర సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మికి, అధికారులకి వినతిపత్రం ఇవ్వడం కన్నా.. దున్నపోతుకి ఇవ్వడం మేలంటూ నినాదాలు చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ పరిసరాల్లో రోడ్లు ఊడ్చి నిరసన కొనసాగించారు. బీఆర్ఎస్ కార్పోరేట్లర్లు సమావేశానికి ర్యాలీగా వచ్చారు. ప్రస్తుత కౌన్సిల్ కు ఇదే చివరి జనరల్ బాడీ సమావేశం కావడంతో నగరంలో ఉన్న సమస్యలపై నిలదీయడానికి సిద్ధమైన బీజేపీ, బీఆర్ఎస్(brs) సభ్యులు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. భూముల అమ్మకంపై పాలకవర్గాన్ని బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించబోతున్నారు. ప్రస్తుత కౌన్సిల్ పదవీకాలం ముగియనుండడంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్ లో ప్రస్తుత సభ్యులతో టీ బ్రేక్ సమయంలో మేయర్, సభ్యులందరితో కలిసి గ్రూప్ ఫొటో దిగనున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశంలో సభ్యులందరికి ఈ ఫొటోను అందించనున్నారు.
