Jubilee Hills by-election| జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రేపే నోటిఫికేషన్ విడుదల

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రేపు సోమవారం ఎన్నికల కమిషన్ నోటీఫికేషన్ విడుదల చేయనుంది. ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే.. సోమవారం నుంచి ఈ నెల 21వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు(Jubilee Hills by-election) రేపు సోమవారం ఎన్నికల కమిషన్ నోటీఫికేషన్(notification) విడుదల చేయనుంది. ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే.. సోమవారం నుంచి ఈ నెల 21వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 22న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాధ్ సతీమణి సునితను బరిలోకి దింపగా..కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఆదివారం ప్రకటించబోతున్నారు. ఆ పార్టీ నుంచి జూటూరు కిర్తీరెడ్డి, లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పద్మ, మాధవీలత, అలపాటి లక్ష్మినారాయణలు రేసులో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండటంతో ఇక్కడ త్రిముఖ పోటీలో నెలకొంది.

నియోజవర్గం నేపథ్యం..

2009 నియోజక వర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్ నుంచి వేరుపడి ఏర్పడ్డ కొత్త నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఇక్కడ మూడోవంతు ముస్లిం ఓటర్లు ఉన్నారు. 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి. జనార్దన్ రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు, 2018, 2023అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మాగంటి గోపినాథ్ గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. గోపీనాథ్ ఆకస్మిక మరణంతో మరోసారి ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది. జూబ్లీహిల్స్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 2,07,367, మహిళా ఓటర్లు 1,91,590, ఇతరులు 25 మంది ఉన్నారు. నియోజకవర్గంలో 80 ఏళ్లకు పైబడిన ఓటర్లలో పురుషులు 3,280, మహిళలు 2,772 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 95 మంది, సర్వీస్ ఎలక్ట్టోరల్స్ ఓటర్లు 18, పీడబ్ల్యుడీ ఓటర్లు 1,891 మంది ఉన్నారు, నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.