MLC Elections | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్రారంభం.. మొట్ట మొద‌ట‌నే ఓటేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభ‌మైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియ‌నుంది. మొత్తం 52మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీ పడుతున్నారు.

  • Publish Date - May 27, 2024 / 08:35 AM IST

సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌
ఓటు వేయనున్న 4,63,839మంది ఓటర్లు

MLC Elections | హైదరాబాద్ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభ‌మైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియ‌నుంది. మొత్తం 52మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌), బీఆరెస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా కోచింగ్ సెంటర్ల నిర్వాహకుడు ఆశోక్‌లు పోటీ పడుతున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్‌లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి మొట్ట మొదటగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ బూత్ ప‌రిధిలో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి మొట్టమొదట గా ఓటు వేశారు మాజీ మంత్రి.

ఈ ఎన్నిక‌ల్లో 4.63 ల‌క్ష‌ల మంది గ్రాడ్యుయేట్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మ‌హిళ‌లు, ఐదుగురు ట్రాన్స్‌జెండ‌ర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,73,645మంది, ఉమ్మడి ఖమ్మంలో 1,23,985మంది, ఉమ్మడి నల్లగొండలో 1లక్ష 66,448మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.

34 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 605 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో స‌గ‌టున 800 మంది ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. 283 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువ‌గా ఓట‌ర్లు ఉన్నారు. 3 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో కూడా అవ‌స‌రానికి ప‌నికొచ్చేలా, కొర‌త లేకుండా అధికారులు మొత్తం 807 బ్యాలెట్ బాక్సుల‌ను, సుమారు 8 ల‌క్ష‌ల బ్యాలెట్ ప‌త్రాల‌ను సిద్ధంగా ఉంచారు.

జూన్ 5వ తేదీన ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి చేస్తారు. పోలింగ్ ముగియ్యగానే బ్యాలెట్ బాక్స్‌లు నల్లగొండలోని స్ట్రాంగ్ రూమ్‌కు చేరుస్తారు. సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆరెస్‌, అధికార పార్టీగా ఈ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌లతో పాటు బీజేపీ కూడా గెలుపు కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి.

Latest News