ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
సచివాలయంలో గ్రూప్ 2 అభ్యర్థులతో భట్టి భేటీ
నిరుద్యోగుల అభ్యర్థన మేరకు కమిషన్ చైర్మన్‌కు ఆదేశాలు
హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగుల డిమాండ్ ఫలించింది. గ్రూప్-2 వాయిదా వేయాలన్న డిమాండ్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ లో గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిసెంబర్‌లో ఈ పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని శుక్రవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంతకు ముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆయన గ్రూప్ 2 అభ్యర్థులతో సచివాలయంలో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా వాయిదా అంశంపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఉద్యోగ ఖాళీలు వెతికి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం
గత ప్రభుత్వం మొదటి పది సంవత్సరాల్లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవని భట్టి పేర్కొన్నారు. సీఎల్పీ నేతగా తాను, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నామని వివరించారు. తెలంగాణ బిడ్డలకు ఎంత తొందరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిదనే కృత నిశ్చయంతో సర్కార్ ఉందన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే జీతాల భారం తగ్గుతుందని, కానీ తాము అలా ఆలోచించడం లేదన్నారు. తెలంగాణ బిడ్డలు స్థిరపడాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్న ప్రభుత్వమిదని ఆయన వెల్లడించారు. విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నామని అన్నారు. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి.. కేసుల పాలైతే నిరుద్యోగులే నష్టపోతారని, కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో ఉద్యోగార్థులు ఇబ్బందులు పడవద్దని కోరారు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నామని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తామన్నారు. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తారని, ప్రిపేర్ అయ్యేవారు ఆయా కేంద్రాల నుంచి ఆన్‌లైన్‌లో అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఇకనుంచి అశోక్‌నగర్‌లో ఐదు రూపాయల భోజనంతో ఇబ్బంది పడాల్సిన పనిలేదని చెప్పారు. నిరుద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తామని, ‘మీరు మా బిడ్డలు.. రాష్ట్ర సంపద. మీ మేధస్సు నిరుపయోగం కావద్దనేదే ప్రభుత్వం ఆలోచన. ఇందిరమ్మ ప్రభుత్వం నూటికి నూరు శాతం మీ సమస్యలు వింటుంది. పరిష్కరిస్తుంది’ అని భట్టి విక్రమార్క చెప్పారు.
గురువారమే నిరుద్యోగులకు ఎంపీ, ఎమ్మెల్సీ హామీ
గురువారం బేగంపేటలోని హరిత ప్లాజాలో నిరుద్యోగ అభ్యర్థులతో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు విద్యార్థి ఉద్యమ నాయకులు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. నిరుద్యోగుల డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. గ్రూప్-2 వాయిదా వేసే ప్రయత్నం చేస్తామని వారు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం గ్రూప్-2ను డిసెంబర్ నెలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ నిరుద్యోగుల డిమాండ్ కారణంగా ఎగ్జామ్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వాయిదాతో పాటు 2 వేల పోస్టులు అదనంగా పెంచాలని నిరుద్యోగుల డిమాండ్. మరి పోస్టులు పెంచుతారా..? లేదా..? అనే దానిపై స్పష్టత లేదు.