Rain in Hyderabad | హైదరాబాద్ : ఆకాశానికి చిల్లు పడిందేమో అన్నట్టు బుధవారం రాత్రి హైదరాబాద్( Hyderabad ) నగరంలో కుండపోత వర్షం( Heavy Rain ) కురిసింది. గంటకు పైగా ఎడతెరిపి లేకుండా వాన దంచికొట్టింది. ఈ భారీ వర్షానికి భాగ్యనగరం( Bhagya Nagaram ) ప్రజలు అతలాకుతలమయ్యారు. రాత్రి వేళ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో.. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్( Traffic Jam ) ఏర్పడింది. రోడ్లపై గంటల తరబడి ప్రయాణికులు ఉండిపోవాల్సి వచ్చింది. ఉరుములు, మెరుపులతో వాన కురియడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇక తెలంగాణ వెదర్‌మ్యాన్( Telangana Weatherman ) చెప్పినట్టే రాత్రి 9.30 గంటలకు వర్షం ప్రారంభమైంది. గంట పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, 40 నుంచి 60 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు బయటకు రాకుండా, ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. ఇది మమూలు వర్షం కాదు.. ఊరమాస్ వర్షం అని తెలంగాణ వెదర్‌మ్యాన్ పేర్కొన్నారు. దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, రాంనగర్, తార్నాక, హబ్సిగూడ, నాచారం, ఉప్పల్, నాగోల్, హయత్‌నగర్, కోఠి, మెహిదీపట్నం, అబిడ్స్, ఖైరతాబాద్, సోమాజిగూడ, సికింద్రాబాద్, బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్‌తో పాటు తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Guys….seriously I’ve no words to say…. What an insane downpour in Hyderabad now ….. Please stay safe everyone 🙏🙏🙏 pic.twitter.com/htxXhlMnT3
— Telangana Weatherman (@balaji25_t) May 21, 2025
అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో బుధవారం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.
రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలని సూచించారు. హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు.