విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ భూముల అక్రమణల(Land Encroachments)పై చర్యల విషయంలో హైడ్రా(HYDRA) ప్రతాపం పేదోళ్లపైనే మాత్రం కొనసాగుతుందని..పెద్దోళ్ల మీదకు హైడ్రా బుల్డోజర్లు వెళ్లడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. పెద్దవాళ్లకు ఒక న్యాయం..పేద వాళ్లకు ఒక న్యాయమా? అనే నినాదంతో కేటీఆర్ తెలంగాణ భవన్ లో హైడ్రా పనితీరుపై ఫోటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా బాధితుల అనుభవాలను, కాంగ్రెస్ మంత్రులు, బడా బిల్డర్ల ఆక్రమణలపైకి హైడ్రా పోకపోవడాన్ని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతో మంది బాధితులుగా మారారని కేటీఆర్ ఆరోపించారు. మూసీ వల్ల, హైడ్రా వల్ల ఎంతో మంది బాధితులుగా మారారన్నారు. చాంద్రాయణ గుట్టలో స్కూల్ కూడా కూలగొట్టారన్నారు. పేదలు కోరుకునేది ఒక్కటే కూడు గూడు గుడ్డ.. అలాంటి పేదల ఇళ్లను ప్రభుత్వం కూల్చేసిందని, ప్రభుత్వానికి అంతా సమానమైతే పెద్ద వాళ్ల జోలికి ఎందుకు వెళ్లలేదు.. వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదలకు న్యాయం చేయాలనుకుంటే.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు ఎందుకు పెడుతున్నట్లు? అని నిలదీశారు. సరైన డాక్యుమెంట్లు, కోర్టు తీర్పులు ఉన్నా కూడా.. టైమ్ ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని చెబుతూ సెలవు దినాల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నారని..ఇక ప్రజాస్వామ్యం ఎందుకు.. కోర్టులు ఎందుకు? అన్నారు. హైడ్రాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పెద్ద ప్రజంటేషన్ ఇచ్చారని..ఆయన ప్రజంటేషన్‌లో చెప్పిన బిల్డర్ల ఆక్రమణలపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు.
ఆ మంత్రులు…పెద్దల ఆక్రమణలను కూల్చే దమ్ముందా..?
ఫుల్ ట్యాంక్ లెవల్లో కడితే ఎవరిని వదలం అని చెప్పి పెద్దలను వదిలేశారని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టారని, మరో మంత్రి వివేక్ కూడా హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారని, సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువు ఎఫ్ టీ ఎల్ లోపల ఇల్లు కట్టుకున్నారని, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలోనే ఇల్లు కట్టుకున్నారని, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెరువులోనే ఇల్లు కట్టుకున్నారని…వారి ఇళ్ల మీదకు వెళ్లే దమ్ము హైడ్రాకు ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. సున్నం చెరువులో ఇల్లు కట్టుకున్న పేదలది తప్పు.. దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డిది ఏ తప్పులేదా అని హైడ్రాను నిలదీశారు. పేదలకు అసలు టైమ్ ఇవ్వరు.. తిరుపతి రెడ్డికి టైమ్ ఇచ్చి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలా చేస్తారని, ఆయనకు నోటీసులు ఇచ్చే దైర్యం హైడ్రాకు ఉందా? అని పశ్నించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. గాజులరామారంలో 11 ఎకరాల ఆక్రమణకు ప్రభుత్వమే అండగా ఉందని… పేదలను వెళ్లగొట్టి గాంధీకి మాత్రం అండగా నిలిచారన్నారు. పెద్ద బిల్డర్లు బఫర్ జోన్లలో, ప్రభుత్వ స్థలాల్లో కడితే వారికి సహకరించి.. తానా తందానా అంటారని, మూసీ కి అడ్డంగా ఆకాశమంత పెద్దగా కడితే కూడా వారికి కనిపించదని కేటీఆర్ విమర్శించారు. బుల్డోజర్ నా శరీరంపై నుంచి వెళ్లాలని యూపీలో రాహుల్ గాంధీ మాట్లాడారని,,అదే తెలంగాణలో బుల్డోజర్ ఇళ్లను కూలగొడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? ఇది తప్పు అని.. రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్పట్లేదన్నారు. ఈ ప్రభుత్వం వల్ల జరిగిన అన్యాయానికి ఎంతో మంది బాధితులుగా మారారని, 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రానుందని..మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం అని కేటీఆర్ చెప్పారు.
