జ‌ర్న‌లిస్టులకు కేటాయించిన‌ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా.. పేట్‌బ‌షీరాబాద్‌లో 38 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ కంచె!

మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం పేట్‌బ‌షీరాబాద్‌లో జ‌ర్న‌లిస్టుల‌కు కేటాయించిన ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 25/2 లోని 38 ఎక‌రాల భూమి చుట్టూ బుధ‌వారం ఫెన్సింగ్ వేసింది.

హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్ 22:

మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం పేట్‌బ‌షీరాబాద్‌లో జ‌ర్న‌లిస్టుల‌కు కేటాయించిన ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 25/2 లోని 38 ఎక‌రాల భూమి చుట్టూ బుధ‌వారం ఫెన్సింగ్ వేసింది. గ‌తంలో భూమిని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ జ‌ర్న‌లిస్ట్స్ మ్యూచ్యువ‌ల్లీ ఎయిడెడ్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ (JNJMACHS)కి రాష్ట్ర ప్ర‌భుత్వం 2008లో కేటాయించింది. ఈ భూమిని జ‌ర్న‌లిస్టుల‌కు కేటాయిస్తూ హెచ్ ఎం డీ ఏ క‌స్ట‌డీలో ప్ర‌భుత్వం ఉంచిన విష‌యం విధిత‌మే. అయితే ఈ కేటాయింపుల‌పై కొంత‌మంది కోర్టుకెళ్ల‌డంతో అక్క‌డ జ‌ర్న‌లిస్టుల‌కు ప్లాట్ల పంపిణీ జ‌ర‌గ‌లేదు. కోర్టులో వివాదం ఉంటుండ‌గానే.. మ‌రోవైపు అక్క‌డ ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని హైడ్రాకు JNJMACHS ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు. ఇదే విష‌య‌మై అక్క‌డ రెవెన్యూ, హెచ్ ఎండీఏ అధికారులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ విష‌య‌మై హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారి ఆదేశాల మేర‌కు రెవెన్యూ, మున్సిప‌ల్‌, హెచ్ ఎండీఏ అధికారుల‌తో క‌లిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించింది. ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగిన‌ట్టు నిర్ధారించుకుంది. ఇప్ప‌టికే కొంత‌మంది ఇళ్లు క‌ట్టుకుని ఉండ‌గా.. వాటి జోలికి పోకుండా ఇంకా ఖాళీగా ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఈ విష‌య‌మై కొంత‌మంది అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌గా.. కోర్టు తీర్పు ప్ర‌కారం ఆ స్థ‌లం కేటాయింపులు జ‌రుగుతాయి.. ఈ లోగా అక్ర‌మ‌ణ‌లు జ‌ర‌గ‌కుండా ప్ర‌భుత్వ భూమిని కాపాడుతున్న‌ట్టు హైడ్రా స్ప‌ష్టం చేసింది. అలాగే అక్క‌డ ఇల్లు క‌ట్టుకుని నివాసం ఉంటున్న వారితో త్వ‌ర‌లోనే స‌మావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రికార్డుల‌ను ప‌రిశీలిస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ చెప్పారు. ఈ స‌మావేశంలో హైడ్రా, రెవెన్యూ, హెచ్ ఎండీఏ, మున్సిప‌ల్ అధికారులు కూడా ఉంటార‌ని తెలిపారు.