ఏదో ఒక స్థానాన్ని ఎంపికలో డైలమా
విధాత : ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వ్యంగ్య బాణాలు సంధించారు. ప్రధాని నరేంద్ర మోదీలా తాను దేవదూత ను కాదని, ఆయన పరమాత్ముని దయతో పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలకు అనుకూలంగా పని చేస్తారన్నారు. కానీ తాను సామాన్య మానవుడునని చెప్పారు. చాలా సాధారణంగా ఉంటానని చెప్పారు. దేశంలోని పేదవారే తనకు దేవుళ్లన్నారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రధాని మోదీ దృక్పథంలో మార్పు వచ్చిందని రాహుల్ గాంధీ వెల్లడించారు.
వాయనాడ్, రాయబరేలి రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి తాను రాజీనామా చేయవలసి ఉందన్నారు. కానీ తాను ఈ రెండు నియోజకవర్గాల్లో సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల్లో దేనికి రాజీనామా చేయాలో తెలియని ఓ విధమైన డైలమాలో తాను ఉన్నట్లు రాహుల్ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అయితే తాను ఎటువంటి నిర్ణయం తీసుకున్నాననేది త్వరలో మీరు చూడబోతున్నారని వాయనాడ్ ప్రజలకు రాహుల్ తెలిపారు. వయనాడ్ ఎంపీగా ఇటీవల విజయం సాధించిన అనంతరం రాహుల్ తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేశారు.
ఈ నేపథ్యంలో బుధవారం కేరళలోని మలప్పురంలో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. తనను వరుసగా రెండోసారి ఎంపీగా గెలిపించినందుకు వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ కృతజ్జతలు తెలిపారు.