Anant Ambani |
విధాత: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ మరోసారి మూగజీవాలపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. మనసుంటే ఎక్కడైనా మంచిపని చేయవచ్చన్నట్లుగా అనంత్ అంబానీ తను చేపట్టిన ద్వారక పాదయాత్రలో వందలాది కోళ్లను సంరక్షించి తన జీవకారుణ్యాన్ని ప్రదర్శించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన 30వ పుట్టిన రోజు ఏప్రిల్ 10వ తేదీ సందర్భంగా ద్వారకాధీశుడు శ్రీ కృష్ణుడిని దర్శించుకునేందుకు తన ఉంటున్న జామ్ నగర్ నుంచి ద్వారకకు మార్చి 28న అనంత్ అంబానీ 144కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.
అనంత్ అంబానీ పాదయాత్ర సాగుతున్న మార్గంలో దేవభూమి ద్వారక జిల్లాలోని కంభాలియా ప్రాంతంలో ఓ కోళ్ల వ్యాన్ ఎదురుపడింది. అది చూసిన అనంత్ అంబానీ ఆ కోళ్ల వ్యాన్ ను ఆపి, అందులోని కోళ్లకు విముక్తి కల్పించారు. ఇందుకోసం కోళ్ల యజమానికి వాటి విలువ కంటే రెట్టింపు డబ్బులిస్తానని చెప్పి .. అతనికి డబ్బులు చెల్లించాలని తన బృందాన్ని ఆదేశించారు. అనంతరం ఆ.. 250 కోళ్లను ప్రాణదానం చేసి వాటిని తన వాంటారాకు తరలించి మరోసారి అనంత్ అంబానీ మూగజీవులపై తన ప్రేమను చాటుకున్నాడు.
ఈ సందర్భంగా ఓ కోడిని అనంత్ అంబానీ తన చేతుల్లోకి తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మనుసున్న మారాజు..అనంత్ అంబానీ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే అనంత్ అంబానీ జామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వంటారా జంతు సంరక్షణ.. పునరావాస కేంద్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 3,500 ఎకరాల విశాలమైన వంటారాలో జంతువుల కోసం జంతుశాస్త్ర పరిశోధన, వాటి రక్షణ, పునరావాస కేంద్రంగా పనిచేస్తుంది. 2,000 కంటే ఎక్కువ జాతులకు నిలయంగా ఉన్న వంటారా.. 1.5 లక్షలకు పైగా అంతరించిపోతున్న జంతువులకు నెలవుగా ఉంది.