కాంగ్రెస్ వచ్చాక 158మంది రైతుల ఆత్మహత్య
విధాత, హైదరాబాద్ : వ్యవసాయానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.72 వేల కోట్లు కేటాయించడం సంతోషకరమని, వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించి, పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను వ్యవసాయ రంగానికి ఇవ్వాలని సీపీఐ ఎమ్మల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. మంగళవారం పద్దులపై చర్చలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించే పంటపై ఆధారపడే ప్రతి ఒక్కరూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. నిరాదరణకు గురై అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 158 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. నీటిపారుదల శాఖకు రూ.వేల కోట్లు ఖర్చుపెడుతున్నా.. రైతులకు నీరు అందడం లేదన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు వచ్చే విధంగా శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అదృష్టవంతులంటారని, కాని నిజానికి వారు గంటల కొద్ది కూర్చుని అధిక శ్రమకు, అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆ కంపనీలపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఉద్యోగుల హక్కులను కాపాడాలని కూనంనేని కోరారు.