విధాత, హైదరాబాద్ :
మావోయిస్టులను ఎన్‌కౌంటర్ పేరుతో చంపడాన్ని, ఆపరేషన్ కగార్ పేరిట సిపిఐ(మావోయిస్టు) నాయకులు, కార్యకర్తలను, ఆదివాసులతో సహా లక్ష్యంగా చేసుకొని చంపడాన్ని నిరసనగా.. అరెస్ట్ చేసిన మావోయిస్టులను ఏలాంటి ప్రాణ హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ప్రజా ఫ్రoట్, తెలంగాణ జన సమితి,కేవీపీఎస్, తెలంగాణ విద్య వంతుల వేదిక, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, పీవైయల్, డివైఎఫ్‌ఐ, ఏఐకెఎంఎస్, పీడీఎస్‌యూ తదితర ప్రజా సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి.
ఈ సందర్బంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ పేరుతో 2025 నవంబర్ 18న సిపిఐ(మావోయిస్టు) నాయకుడు మడావి హిడ్మాతో సహా ఆరుగురిని ఎన్‌కౌంటర్ పేరిట ఆంధ్ర ప్రదేశ్ లోని మారేడుమిల్లి ప్రాంతంలో పట్టుకొని చంపేశారని అన్నారు. ఈ ఘటనపై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నవంబర్ 19న మావోయిస్టు పార్టీకి చెందిన మరో ఏడుగురిని రంపచోడవరం ప్రాంతంలో చంపివేశారని.. ఈ ఎన్‌కౌంటర్‌లన్నీ బూటకమని పౌర హక్కులు, ప్రజాస్వామిక హాక్కుల సంఘాలు ప్రకటించాయని గుర్తుచేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లపై న్యాయ విచారణ జరిపించాలని అన్నారు. ఎన్‌కౌంటర్‌లను ఆపి ఆపరేషన్ కగారును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున సాగుతున్న ఈ ఎన్‌కౌంటర్లలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న వైఖరిని ఖండించాలన్నారు.
అనేక మంది మావోయిస్టులను ఆంధ్రప్రదేశ్లో అరెస్టు చేశారని, వారికి ప్రాణహాని ఉన్నందున వెంటనే కోర్టుకు సరేండర్ చేయాలన్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ నాయకుడు తిప్పని తిరుపతి / దేవ్ జీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. అరెస్టు చేసిన వారందరినీ ఆలస్యం చేయకుండా కోర్టుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాల్లోని ఖనిజ వనరులను దేశ, విదేశీ కార్పొరేట్లకు స్వాధీనం చేసే ప్రభుత్వ విధానం అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలో భాగంగానే ఆపరేషన్ కగార్ ఉందని తెలిపారు. ఈ వనరులను కొల్లగొట్టడానికి ప్రభుత్వం అనేక ఒప్పందాలు కార్పొరేట్లతో చేసుకుందని. ఆ విధమైన ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలనీ, ఆదివాసులను తమ నివాసాల నుండి బలవంతంగా నిర్వాసితులను చేయొద్దని డిమాండ్ చేశారు. ఆదివాసుల హక్కులకు సంబంధించిన అటవీ హక్కుల చట్టం, పీసా నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ బూటకపు ఎన్ కౌంటర్స్ పై ప్రజలు, ప్రజా స్వామిక వాదులు నిరసన తెలపాలన్నారు. అడవులు ధ్వంసం అయితే మానవ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని తెలిపారు.
సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా ఫ్రంట్ జిల్లా కన్వీనర్ సీహెచ్ సుధాకర్ రెడ్డి, జన సమితి జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, టీవీవీ జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొంగరాల నర్సింహా, బొమ్మిడి నగేష్, సీఐటీయూ జిల్లా నాయకుడు ఎండీ సలీమ్, అవుట రవీందర్, అఖిల భారత రైతు-కూలీ సంఘం పీవై.ఎల్ జిల్లా కార్యదర్శి బి. వి చారి, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, విద్యా పరిరక్షణ కమిటీ బాధ్యుడు ఆర్.విజయ్ కుమార్, సీపీఐ (యం-యల్) న్యూడెమోక్రసీ నాయకుడు కల్లూరు అయోధ్య, బీరెడ్డి సత్తిరెడ్డి, ఏనుగు సత్తిరెడ్డి, రావుల వీరేష్, సీహెచ్ యాదగిరి రెడ్డి, ఆదివాసీ హక్కుల పోరాట వేదిక రుద్రాక్షి దుర్గయ్య, ఈసం యాదగిరి, యాడవెల్లి నర్సింహా, అడ్వకేట్ నజీరద్దీన్, బొల్లె రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
