విధాత : మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారంకు బుంగలు పడగా కేంద్ర డ్యాం సెఫ్టీ అథార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తూ దెబ్బతిన్న భాగాల పునర్ నిర్మాణ అవశ్యకతను చాటుతూ ఇచ్చిన నివేదిక సంచలనంంగా మారింది. ఈ వివాదం ఎన్నికల వేళ అధికార బీఆరెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారగా, రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు ఆ నివేదికను తిప్పికొట్టేలా సమాధానాలు రాసి పంపారు. ఇది ఇలా ఉండగానే నీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ కాళేశ్వరం ఎత్తిపోతలలో అధిక నీటి తరలింపునకు వినియోగించే స్టాటిక్ ఫ్రీక్వెన్సీ కన్వర్టర్(ఎస్ఎఫ్ఎసీ)ల కొనుగోళ్లకు సంబంధించి తనిఖీలు, పరిశీలనకు ఈ నెల 14 నుంచి 25 వరకు జర్మనీ పర్యటనకు వెళ్తున్నారు. రజత్‌కుమార్ పర్యటనపై ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది.
ఈ నెల 30న ఐఏఎస్ గా రజత్‌కుమార్ ఉద్యోగ విరమణ పొందుతున్నారు. అలాగే ఇంకోవైపు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పదవి విరమణకు ముందు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్తు పరికరాల కొనుగోలుకు జర్మనీకి వెలుతుండం వెనుక ప్రతిపక్ష పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయన పర్యటన వెనుక ప్రభుత్వం పరికరాల కొనుగోలుతో ఏదైనా కమిషన్ల బాగోతం నడిపిస్తుందా అన్న అనుమానాలను వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్ నుంచి ఎగువకు రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసే విధంగా ఇప్పటికే పంపులు, విద్యుత్ వ్యవస్థ ఉన్నాయి. అయితే మరో టీఎంసీ తరలింపునకు వీలుగా పాత నిర్మాణాలకు సమాంతరంగా కావాల్సిన పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్యాకేజీ 1, 4లలో గుత్తేదారు సంస్థలు పంపులు ఏర్పాటు చేస్తున్నాయి. వాటికి సంబంధించి విద్యుత్ సరఫరా వ్యవస్థలో వినియోగించే కీలకమైన ఎస్ఎఫ్‌ఎసీలు జర్మనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. వాటి కొనుగోలు, పరిశీలనకు అధికారుల బృందం జర్మనీలోని న్యురెంబర్గ్ వెళ్లేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రజత్ కుమార్ తోపాటు ఈఎన్సీ సి. మురళీధర్, కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా -హరిరాం ఎత్తిపోతల పథకాల సలహాదారుడు కె పెంటారెడ్డి, సిద్దిపేట ఎస్ఈ హెచ్, బస్వరాజ్, విద్యుత్ శాఖ ట్రాన్స్ కో డైరెక్టర్ జె.సూర్యప్రకాశ్, సీఈ పి. ఉపేందర్ బృందంలో ఉన్నారు. ప్యాకేజీ 1, 4లకు చెందిన ఇద్దరు ప్రతినిధులు కూడా వెళ్తున్నట్లు తెలిసింది. అయితే పలు కారణాలతో ఈఎన్సీ మురళీధర్, ఎస్ఈ బస్వరాజ్, ట్రాన్స్‌కో సీఈ ఉపేందర్ ఈ పర్యటనకు దూరమవుతున్నారని తెలుస్తోంది. బీఆరెస్ ప్రభుత్వం ఇప్పటికే రిటైర్డ్ అధికారులను పెద్ద సంఖ్యలో కీలక పోస్టులలో నియమించుకుని వారి సేవలను తనకు ప్రయోజనకరంగా ఉండేలా వినియోగించుకుంటుందని ప్రతిపక్షాలు తరుచు విమర్శిస్తునే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కూడా నిరంతరం ఆరోపణలు గుప్పిస్తునే ఉన్నాయి. అదిగాక మూడో టీఎంసీ తరలింపుకు కేంద్రానికి డీపీఆర్ ఇవ్వకపోవడం, తగిన అన్ని అనుమతులు సాధించలేదు. ఇవేవి పట్టించుకోకుండా ఎన్నికల వేళ అదికూడా నెలాఖరుకు రిటైర్ అయ్యే అధికారితో కూడిన బృందాన్ని జర్మనికి కన్వర్టర్ల కోనుగోలు, తనిఖీల కోసం పంపాల్సిన అత్యవసరం ఏముందన్న ప్రశ్న విపక్షాల నుంచి ఉత్పన్నమవుతుంది. ప్రభుత్వం మారితే కొనుగోలు దిశగా రజత్‌కుమార్ బృందం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించే అవకాశం కూడా ఉండనేవుంది. ఈ నేపధ్యంలో రజత్‌కుమార్ బృందం జర్మనీ పర్యటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.