విధాత, హైదరాబాద్ : ప్రభుత్వ పాలసీల ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల స్కామ్ లకు పాల్పడుతుందని మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి ఆరోపించారు. 400 మంది పెట్టుబడుదారులు, 40 మంది మంత్రుల కోసం 4 కోట్ల ప్రజల్ని ముంచుతున్నారని..హిల్ట్ పాలసీ పేరుతో ప్రభుత్వ భూములను పారిశ్రామిక వేత్తలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే ప్రభుత్వ భూముల విషయంలో నిర్ణయం తీసుకున్నాడని..బండారం బయటపడిన తర్వాత మంత్రులకు వాటాలు ఇచ్చి.. వారి నోళ్లు మూయించాడని కీలక ఆరోపణలు చేశారు.
10 వేల ఎకరాల విలువైన భూములను కారు చౌకగా, సీఎంరేవంత్ రెడ్డి తన ఆత్మీయ బంధువులకు అప్పగించేందుకు సిద్ధమయ్యాడని, త్వరలోనే వారి వివరాలు బయట పెడతామని..ఇందులో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు 40 మంది ఉన్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలనే కాదు, తెలంగాణ ప్రజలను మోసం చేయడమే, ఈ హిల్ట్ పి పాలసీ అని, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పుకుంటూ..ఓఆర్ఆర్ దగ్గర ఎకరం 137 కోట్లు పలికిందని చెప్తున్న ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న భూములని కారు చౌకగా కట్టబెడుతున్నారని విమర్శించారు. పారిశ్రామిక భూములను ఒక పథకం ప్రకారం తక్కువ ధరకి కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని, ల్యాండ్ మార్క్ ఇన్స్టేటివ్ కాదు, ల్యాండ్ స్కామ్ ఇన్స్టేటివ్ ఇది అని దుయ్యబట్టారు. దొంగలు, దొంగలు భూములు పంచుకోవడమే ఈ ల్యాండ్ స్కామ్ ఇన్స్టేటివ్ అని ఆరోపించారు. నాచారం, బాలానగరంలో గజం లక్ష యాభై వేలు మార్కెట్ ధర ఉంటే, ఇవ్వాళ 10వేలు రూపాయలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ఎకరాకు ప్రభుత్వానికి రూ.3కోట్లు..రేవంత్ రెడ్డి బంధువులకు రూ.30కోట్లు
ఎకరానికి ప్రభుత్వానికి కట్టేదే 3 కోట్ల ఆదాయం వస్తే, రేవంత్ రెడ్డి బంధువులకు 30 కోట్లు లాభం చేకూరుతుందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎకరానికి 50 నుంచి 70 కోట్లు రావాల్సింది, రావడం లేదు, దాదాపుగా 20వేల ఎకరాల భూమి ఈ విధంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల అవసరాల కొరకు ప్రభుత్వ భూములు ఉపయోగ పడాలని ఆనాడు కేసీఆర్ అన్నారు. పార్కులు, ఆసుపత్రులు కట్టేందుకు.. లంగ్ స్పేస్ లా ఉపయోగపడాల్సిన భూములను ప్రైవేట్ వారికి అప్పగించి భవిష్యత్తు ప్రజా అవసరాలను పట్టించుకోవడం లేదన్నారు.
మేం వచ్చాక మళ్లీ రికవరి
పారిశ్రామిక భూములకు సంబంధించి ఆనాడు నేను, కేటీఆర్, హరీష్ రావు కూర్చొని వాటిని కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నామని..అందుకు భిన్నంగా సోయి లేని కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే తెలిసిన రేవంత్ రెడ్డి..హిల్ట్ పి పాలసీతో దోపిడికి తెర లేపాడని.. మంత్రులకు వాటాలు ఏర్పాటు చేసి నోర్లు మూయించాడని జగదీష్ రెడ్డి ఆరోపించారు. పారిశ్రామిక వాడలోనీ భూములను ఎవరికీ కేటాయించారో వారి పేర్లు బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారి ఇండ్లను కూల్చిన కాంగ్రెస్ పాలకులు..ప్రజల భూములను ఇష్టం వచ్చినట్లు రేవంత్ రెడ్డి బంధువులకు ఎలా కట్టబెడుతారని ప్రశ్నించారు. దోపిడి దొంగల హిల్ట్ పి పాలసీ ని మేం తిప్పి కొడుతామని.. ప్రజల పక్షాన మేము ఉంటాం అని పేర్కొన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఇందులో దొంగలు ఎవరున్నా వదిలిపెట్టేది లేదని.. ఆస్తులను తిరిగి ప్రజలకు కట్టబెడుతామని స్పష్టం చేశారు.
కొత్త థర్మల్ పవర్ ఫ్లాంట్ల వెనుక వేల్ కోట్ల స్కామ్
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన దామరచర్ల, రామగుండం థర్మల్ పవర్ ఫ్లాంట్లను తప్పుబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా కొత్త థర్మల్ పవర్ ఫ్లాంట్లను నిర్మించడం విడ్డూరమని జగదీష్ రెడ్డి విమర్శించారు. కేవలం కాంట్రాక్టులు, కమిషన్ల కోసం కాంగ్రెస్ థర్మల్ పవర్ ఫ్లాంట్లకు తెరలేపిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. 2028నాటికి థర్మల్ పవర్ ఉత్పత్తిని 40శాతం తగ్గిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడెందుకు తన పాలసీ మార్చుకుందో చెప్పాలని నిలదీశారు. ఎన్టీపీసీ స్టేజ్ 2 ఫ్లాంట్ నుంచి తక్కువ ధర రూ.4.12కే విద్యుత్ అందిస్తామని చెబుతుంటే..రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రూ.10ఖర్చయ్యే మూడు కొత్త ఫ్లాంట్ల నిర్మాణానికి నిర్ణయించడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. దీని వెనుకు రూ.50వేల కోట్ల స్కామ్ దాగి ఉందని ఆరోపించారు. అప్పల రాష్ట్రం అంటూనే కొత్త థర్మల్ ఫ్లాంట్లకు వేలకోట్లు ఎక్కడి నుంచి తెస్తారని విమర్శించారు. అలాగే లాభాల్లో ఉన్న డిస్కమ్ లను ప్రైవేటుకు అప్పగించేందుకు కొత్త డిస్కం ఏర్పాటుకు సిద్దమైందని ఆరోపించారు.
