Site icon vidhaatha

అదనపు యూరియా కేంద్రాలు.. రైతుల సౌలభ్యం కోసం ఏర్పాటు : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

Jangaon collector Sheikh Rizwan Basha

జనగామ, సెప్టెంబర్ 8 ( విధాత) : రైతులకు అవసరమైన యూరియా సకాలంలో, పారదర్శకంగా అందించడానికి జిల్లా వ్యాప్తంగా రైతు వేదికలతో పాటు పీఏసీఎస్ లలో అదనపు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు . ఈ విక్రయ కేంద్రాలకు అవసరమైన ఈ–పాస్ యంత్రాలను కలెక్టర్ తన ఛాంబర్ లో పీఏసీఎస్ డీలర్లకు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. దీంతో రైతులు ఎలాంటి నిరీక్షణ లేకుండా తమ గ్రామంలోనే యూరియాను కొనుగోలు చేసుకోవచ్చన్నారు .
యూరియా పంపిణీలో బాధ్యత వహించే సిబ్బందికి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా అందించామని తెలిపారు. రైతులు తమ తమ గ్రామాలకు కేటాయించిన రైతు వేదికలలో లేదా అదనపు విక్రయ కేంద్రాల్లోనే యూరియా కొనుగోలు చేసుకోవాలని సూచించారు.

యూరియా పంపిణీ వ్యవసాయ విస్తరణ అధికారుల పర్యవేక్షణలో పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందన్నారు. రైతులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, పంట నమోదు పత్రాలు తీసుకువచ్చి మాత్రమే యూరియా పొందాలన్నారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ వంటి ఘటనలు చోటుచేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరానికి మించిన యూరియాను వాడవద్దని..శాస్త్రీయ పద్ధతిలో యూరియాను వినియోగించాలని రైతులకు కలెక్టర్ సూచించారు.

 

Exit mobile version