విధాత, హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీగా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జితేందర్ నియామితులయ్యారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోం శాఖ స్పెషల్ సీఎస్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. డీజీపీ బాధ్యతలో జితేందర్ 14నెలల పాటు కొనసాగనున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కావడం విశేషం. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఎన్నికల కమిషన్ నియమించింది. అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌ను క్రమశిక్షణ చర్య కింద ఈసీ సస్పెండ్ చేసిన తర్వాత రవిగుప్తాను ఎంపిక చేసింది. అప్పటినుంచి ఆయనే డీజీపీగా ఉన్నారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి స్థాయి డీజీపీగా జితేందర్‌ను నియమించారు.
ఏఎస్పీ నుంచి డీజీపీ స్థాయికి
1992ఐపీఎస్ బ్యాచ్ అధికారియైన జితేందర్ పంజాబ్ రాష్ట్రం జలందర్‌లో రైతు కుటుంబంలో జన్మించారు. తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికైన జితేందర్ నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు. తర్వాత ఢిల్లీ సీబీఐలో, 2004-06 వరకు గ్రేహౌండ్స్ లో పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పాలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్‌లో ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు.