Rajesh Bittu | హైదరాబాద్ : సీనియర్ ఆర్టిస్ట్, డిజైనర్ రాజేష్ (బిట్టు) దశదిన కర్మ సోమవారం జరిగింది. కొల్లూరు డబుల్ బెడ్రూం నివాస సముదాయంలో నిర్వహించిన బిట్టు దశదిన కర్మకు ఆర్టిస్టులు, జర్నలిస్టులు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు. అతని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. రాజేష్ సేవలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ నెల 2వ తేదీన బ్రెయిన్ స్ట్రోక్‌తో రాజేష్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. రాజేష్ స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ఆంధ్రప్రభ దినపత్రికలో డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన బిట్టు.. అనంతరం ఆంధ్రజ్యోతి, మనం దినపత్రికల్లో సీనియర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. వెలుగు దినపత్రికలో ప్రారంభ సంచిక నుంచి పనిచేశాడు. ఆ పత్రిక లే- అవుట్ రూపొందించడంలో తన ముద్ర వేశారు. మొదటి పేజీ, స్పెషల్ పేజీ రూపొందించడంలో బిట్టుది అందెవేసిన చేయి. తెలుగు పత్రికారంగంలో కొత్త కొత్త లే అవుట్లు డిజైన్ చేయడంలో బిట్టు ప్రముఖ పాత్ర పోషించారు. స్వేచ్ఛ ( బిగ్ టీవీ) దినపత్రికలో చీఫ్ ఆర్టిస్ట్‌గా పని చేశారు.
కేవలం పత్రికారంగంలోనే కాక.. చిత్రకళలోనూ బిట్టు తన ప్రతిభను కనబరిచారు. ఎన్నో గొప్ప చిత్రాలు, ప్రముఖుల చిత్రాలు బిట్టు కుంచే నుంచి జాలువారాయి. అందరితోనూ కలివిడిగా ఉంటూ ఎంతో మందికి పని నేర్పించిన బిట్టు హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని పలువురు సీనియర్ జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు.