Jubilee Hills ByElection| జూబ్లీహిల్స్ నామినేషన్ల వెల్లువ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్లు వెల్లువెత్తాయి. గుర్తింపు పొందిన పార్టీల కంటే ఇండిపెండెంట్ అభ్యర్థుల భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 211మంది అభ్యర్థులు 321నామినేషన్లు దాఖలు చేశారు.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills ByElection)లో నామినేషన్లు(Nominations) వెల్లువెత్తాయి. గుర్తింపు పొందిన పార్టీల కంటే ఇండిపెండెంట్ అభ్యర్థుల భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం రోజున పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు తరలివచ్చారు. దీంతో మధ్యాహ్నం 3గంటలకు వరకు ఆర్వో కార్యాలయం లోపలికి చేరుకున్న వారిని టోకెన్లు ఇచ్చి నామినేషన్లకు అనుమతించారు. బుధవారం తెల్లవారుజాము 3గంటల వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగింది. హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ హేమంత్‌ కేశవ పాటిల్, రిటర్నింగ్‌ అధికారి సాయిరాంలు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం 211మంది అభ్యర్థులు 321నామినేషన్లు దాఖలు చేశారు.

తొలి ఆరు రోజుల్లో 94నామినేషన్లు దాఖలవ్వగా.. చివరి రోజు ఒక్కరోజునే 117మంది అభ్యర్థులు 194నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఆర్ఆర్ఆర్ రైతులు 11మంది, ఫార్మాసిటీ రైతులు 10మంది, గ్రూప్ వన్ అభ్యర్థులు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మహానాడు నాయకులు మరికొందరు నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఉపసంహరణకు తుది గడువు 24. నవంబర్‌ 11న పోలింగ్‌ జరగనుండగా.. ఓట్ల లెక్కింపు నవంబర్‌ 14న చేపట్టనున్నారు.