Maganti Sunitha | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక( Jubleehills by poll ) నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత( Maganti Sunitha ).. నిన్న నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో మాగంటి సునీత తన ఆస్తి వివరాలను వెల్లడించారు. ఇక ఆమె వద్ద కిలోల కొద్ది బంగారం( Gold ), వెండి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సునీత ఆస్తుల చిట్టా చూసి పలువురు షాక్ అవుతున్నారు.
అఫిడవిట్ ప్రకారం.. ప్రస్తుతం సునీత చేతిలో రూ. 38,800 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక మూడు బ్యాంకుల్లోని ఖాతాల్లో మొత్తం రూ. 32 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. నాలుగు కిలోల బంగారం సహా బాండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, వెండి ఆభరణాలు ఉన్నాయని, వాటి విలువ రూ.6,18,54,274గా పేర్కొన్నారు. స్థిరాస్తులు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 34లో ఒక ప్లాటు, గోపన్నపల్లిలో మరో ప్లాటు ఉన్నాయని, వాటి విలువ రూ.6.11 కోట్లని తెలిపారు. ముగ్గురు పిల్లల పేరిట రూ.4.62 కోట్ల విలువైన షేర్లు, ఆభరణాలు, రూ.8 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తన పేరిట 4.44 కోట్లు, పిల్లల పేరుపై రూ.6 కోట్ల అప్పు ఉన్నట్లు తెలిపారు.
మొత్తంగా సునీత, వారి కుటుంబ సభ్యుల పేరిట రూ. 14.18 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ. 10.8 కోట్ల చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ. 10.54 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. 4.097 కిలోల బంగారం, 6.25 కిలోల వెండి ఉన్నాయి. ఇక సునీతపై ఇటీవలే జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైన విషయాన్ని కూడా ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్నారు.