Jubleehills By poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక( Jubleehills By poll )నేపథ్యంలో ఆయా పార్టీల రాజకీయ నేతలు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని ఆయా డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే ఈ ఉప ఎన్నికకు నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. మొత్తం 12 గుర్తింపు కార్డుల్లో( Identity Cards ) ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లి తమ ఓటు( Vote ) హక్కును వినియోగించుకోవచ్చని జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లకు సూచించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ అధికారిక ప్రకటన చేశారు.
ఓటర్ల జాబితాలో పేర్లు ఉండి, ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు (EPIC) లేని ఓటర్లు, పోలింగ్ స్టేషన్‌లో ఈ కింది 12 గుర్తింపు కార్డులలో దేనినైనా చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు వెసులుబాటు కల్పించారు. మరి ఆ 12 గుర్తింపు కార్డుల జాబితా ఏదో పరిశీలిద్దాం..
12 గుర్తింపు కార్డుల జాబితా ఇదే..
1. ఆధార్ కార్డు
2. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డు
3. బ్యాంకు లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఖాతా బుక్
4. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు లేదా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు
5. డ్రైవింగ్ లైసెన్స్
6. పాన్ కార్డు
7. ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డ్
8. పాస్ పోర్ట్
9. ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్
10. ప్రభుత్వ, పీఎస్‌యూ లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల్లో జారీ చేసిన గుర్తింపు కార్డు
11. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు,
12. ప్రత్యేక వైకల్యం ఐడీ కార్డు(UDID)