Justice Ghosh commission | కాళేశ్వరం ప్రాజెక్టులోని అవతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ నివేదికపై తుది కసరత్తు చేస్తుంది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశముంది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 115 మందిని కమిషన్ ప్రశ్నించి, వాంగ్మూలాలను నమోదు చేసింది. విచారణ..నివేదికలపై తుది కసరత్తు కోసం జస్టిస్ ఘోష్ సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఘోష్ లేఖను అనుసరించి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పైళ్లను జూన్ 30న కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఫైళ్లలోని అంశాలను..విచారణలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ చెప్పిన అంశాలతో విశ్లేషించి నివేదికను తయారు చేయనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అధికారులను, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలను విచారించిన ఘోష్ కమిషన్ వాటన్నింటిని క్రోడికరించి. ఈ నెలాఖరు కల్లా ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు సిద్ధమవుతుంది.