బీజేపీలో చేరితే పునీతులు.. కాంగ్రెస్‌లో చేరితే విమర్శలు

బీజేపీలో చేరితే పునీతులు అవుతారు.... కాంగ్రెస్లో చేరితే విమర్శలు చేస్తారంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా విమర్శించారు.

  • Publish Date - April 2, 2024 / 12:50 PM IST

వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీజేపీ
బీఆర్ఎస్‌లోనే షిండేలున్నారు
ఎర్రబెల్లి, పల్లా, రసమయి పై ఫైర్
కృష్ణమాదిగ విధానంతో దళితులకు నష్టం
మీడియాతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి

విధాత, వరంగల్ ప్రతినిధి: బీజేపీలో చేరితే పునీతులు అవుతారు…. కాంగ్రెస్లో చేరితే విమర్శలు చేస్తారంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా విమర్శించారు. పదేండ్ల బీజేపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నింటిని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీలను ప్రయోగించి విపక్ష నేతలను లొంగదీసుకుని బిజెపిలో చేర్పించుకుంటున్నారని విమర్శించారు. పదేళ్లుగా బిజెపి దేశంలోని అన్ని రకాల వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ఆ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, ప్రాంతీయ పార్టీలకు ఆశక్తి లేదన్నారు. అందుకే తాను, తన బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కడియం స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి మంగళవారం హనుమకొండలో తన కుమార్తె కడియం కావ్యతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

బీఆర్ఎస్ లోనే షిండేలు

ఏకనాథ్ షిండేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారు… ఇప్పటికీ ఆ పార్టీలోని అనేక మంది నాయకులు తాను పార్టీ మారుతాను…తన పై ఉన్న కేసులు ఎత్తేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులను కోరుకుంటున్నారని కడియం చెప్పారు. ఇలాంటి నాయకుల గురించి కూడా నాకు తెలుసన్నారు. తాను పార్టీ మారడం పై స్పందిస్తూ తాను చట్టపరమైన చర్యలకు లోబడి ఉంటానని స్పష్టం చేశారు. ఇక నన్ను రాజీనామా చేయాలనే అర్హత బిఆర్ఎస్ పార్టీకిగానీ, ఆ నాయకులకుగానీ లేదన్నారు. ఈ పార్టీల మార్పుల సంస్కృతికి బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎక్కువగా సాగిందన్నారు. తాను బీఆర్ఎస్ లో ఉంటూ కేసిఆర్ కు వెన్నుపోటు పొడవలేక కాంగ్రెస్లో చేరుతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ నమ్మకాన్ని వమ్ముచేయను

కాంగ్రెస్ పార్టీ మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనంటూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానని, నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కడియం చెప్పారు. భారత రాష్ట్ర సమితిని వదలడం బాధగానే ఉంది, కేసీఆర్ పట్ల గౌరవం ఉంది, కెసిఆర్ పై నేను ఎలాంటి విమర్శలు చేయదలచుకోలేదన్నారు.

ఎర్రబెల్లి, పల్లా, రసమయి పై ఫైర్

మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ల పై కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ మార్పు పై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది పార్టీ మారుతున్నారు… అనేకమంది పార్టీలు మారినా… పార్టీ ప్రధాన నాయకులు అంత తీవ్రంగా స్పందించలేదు. నా మీద మాత్రం ముఖ్య నాయకత్వం, వరంగల్ జిల్లా నాయకత్వం తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని కడియం ఆవేదన వ్యక్తం చేశారు. విమర్శల్లో తన పై ఉన్న ఈర్ష్య వ్యక్తమవుతున్నదని అన్నారు.

పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకున్నప్పటికీ, తన మనవరాలంత వయసు ఉన్న అమ్మాయి చేతిలో ఓటమిపాలయ్యినందుకు సిగ్గుపడాలన్నారు. ఎర్రబెల్లీ… ఈ అహంకారపు, బలుపు మాటలే కదా… నీ ఓటమికి కారణమంటూ విమర్శించారు. జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు. వీడొక్కడే గెలిచిండనే కోపం కూడా తన పై వారికి ఉందన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిప్పు తొక్కిన కోతిలెక్క ఎగురుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్, బీఆర్ఎస్ ప్రస్తుతం ఈ దుస్థితికి రావడానికి పల్లా లాంటి చీడపురుగులు అక్కడ చేరి నాశనం చేశారన్నారు. కేసీఆర్ పక్కన ఉండి లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టుపట్టించారన్నారు. నా చరిత్రను రాజేశ్వర్ రెడ్డి బయటపెడుతాడట, ఈ పని ఎన్నికలకు ముందు చెయ్…. తాను ఎక్కడ ఎక్కడ భూకబ్జాలకు పాల్పడ్డానో… ఎన్నికలకు ముందు బయట పెట్టు… నీ దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టు… లేకుంటే….నీ బట్టలూడదీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టడం ఖాయమంటూ తీవ్రంగా హెచ్చరించారు. రసమయి బాలకిషన్ తన ఇంటి ముందు చావు డప్పుకొడుతాడట, పండబెట్టి తొక్కితే కడుపులో పేగులు బయటపడుతాయంటా మానకొండురులో ప్రజలు పాతాళానికి తొక్కినా … బుద్ధి లేదు రా?…. నీ మొహానికి నా ఇంటికొచ్చేంత సీన్ ఉందా అంటూ ప్రశ్నించారు.

దళితులకు తీవ్ర నష్టం

మందకృష్ణ తన పై చేసే వ్యక్తిగత ఆరోపణలను నేను పెద్దగా పట్టించుకోనని కడియం చెప్పారు. 30 సంవత్సరాలుగా నేను లేకుండా దండోరా ఉద్యమం లేదు… మందకృష్ణ మాదిగ నిర్వహించిన ప్రతీ సమావేశానికి తన సహకారం ఉందన్నారు. కానీ, దళితులు, ముస్లీల పై, చర్చిలపై దాడులు చేస్తూ దళితవాదానికి, అంబేద్కర్ వాదానికి వ్యతిరేకమైన బీజేపీకి కృష్ణ మాదిగ మద్ధతు తెలపడం సరైందికాదన్నారు. రిజర్వేషన్లనే ఎత్తివేయాలని బీజేపీ యోచిస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్తశుద్ది ఉంటే ఎందుకు ఆర్డినెన్స్ ద్వార పరిష్కరించలేదని ప్రశ్నించారు.

నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా

మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావు లతో పాటు ఎవరి దగ్గరి నుంచైనా ఒక్క రూపాయి తీసుకున్నట్లుగా రుజువు చేస్తే నేను, నా బిడ్డ పోటీ నుంచి తప్పుకుంటామని కడియం సవాల్ చేశారు., జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులారా… మీ అందరి బతుకులు నాకు తెలుసు… మీ అందరి చరిత్ర నాకు తెలుసు.. ఇవన్నీ బయటపెడితే జిల్లాలో మీరు తిరగలేరన్నారు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూకబ్జాలు, దారుణాలు ఇవన్నీ బయట పెడితే గ్రామాల్లో తిరగలేరంటూ హెచ్చరించారు. నేను ఆ పని చేయను… మీ దగ్గర నాకు సంబంధించిన సమాచారం ఉంటే బయట పెట్టాలని ఆహ్వానిస్తున్నట్లు కడియం చెప్పారు. తాను ఏ కాంట్రాక్టర్ దగ్గరనైనా పది కోట్లు తీసుకున్నట్లుగానీ, పది ఎకరాల భూమి అక్రమించినట్లుగానీ, వెయ్యి గజాల ఇంటి స్థలంగానీ కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఆ ఆస్తులను జిల్లా ప్రజలకు లేకుంటే, జిల్లా అధికారుల పేరుతో రాసిస్తానని కడియం ప్రకటించారు.

Latest News