Site icon vidhaatha

Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ పాత్రపై ఘోష్‌ కమిషన్‌ సంచలన వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్:

Kaleshwaram Project | కాళేశ్వరం అవకతవకలకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ పేర్కొన్నది. కాళేశ్వరం అవకవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ పూర్తి నివేదికను ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేలకు కాళేశ్వరం కమిషన్ నివేదికను పెన్ డ్రైవ్ రూపంలో అందించారు. ఈ నివేదికలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాత్రపై కమిషన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గత ముఖ్యమంత్రి సాంకేతికంగా, పాలనాపరంగా జోక్యం చేసుకోవడం వల్లే అవకతవకలు, చట్ట వ్యతిరేక నిర్ణయాలు చోటు చేసుకున్నాయని కమిషన్‌ అభిప్రాయపడింది. అందుకే అప్పటి ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాజకీయ కార్యనిర్వాహక స్థాయిలోనే జవాబుదారీతనాన్ని కూడా అక్కడే నిర్ధారించాలని పేర్కొన్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు బరాజ్‌ల ప్రణాళిక, నిర్మాణాల్లో పూర్తిస్థాయిలో లోపాలు, తప్పిదాలు ఉన్నాయని కమిషన్‌ నివేదిక స్పష్టం చేసింది. అంచనాలు తయారు చేయడంతోపాటు పరిపాలన అనుమతుల్లోనూ లోపాలు ఉన్నాయని పేర్కొన్నది. ఈ ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతుల్లోనూ లోపాలు ఉన్నాయన్నది. డీపీఆర్ పూర్తిగా పరిశీలించకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు ఆమోదించారని పీసీ ఘోష్ కమిషన్ అభిప్రాయపడింది. మేడిగడ్డ వద్ద బరాజ్‌ నిర్మించరాదని నిపుణుల కమిటీ పేర్కొన్నా.. నాటి సీఎం కేసీఆర్‌ నిర్ణయం ప్రకారమే మేడిగడ్డతోపాటు, సుందిళ్ల, అన్నారం వద్ద బరాజ్‌లు నిర్మించారని తెలిపింది. వీటి నిర్మాణ కాంట్రాక్టుల విధానం కూడా సరిగా లేదని పేర్కొన్నది. డీపీఆర్‌ను పూర్తిగా పరిశీలించకుండానే అంచనాలు ఆమోదించారని తెలిపింది. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే అంచనాల పెంపు విషయంలో నిబంధనలను సడలించినట్టు కమిషన్‌ తేల్చి చెప్పింది. ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, నిర్వహణ సరిగా లేని కారణంగానే మూడు బరాజ్‌లకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లిదని తెలిపింది. ఈ మూడు బరాజ్‌ల నిర్మాణం అతి పెద్ద పని అని కమిషన్‌ పేర్కొన్నది. దీనిని తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా పేర్కొన్నారని తెలిపింది.

అప్పటి ముఖ్యమంత్రి ప్రతి అంశాల్లో నిర్ణయాలు తీసుకున్నారని కమిషన్‌ నివేదిక స్పష్టం చేసింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతలను రీఇంజినీరింగ్‌ చేసే పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆలోచన చేయడం మొదలుకుని, వ్యాప్కోస్‌కు నామినేషన్‌ పద్ధతిపై కన్సల్టెన్సీ సర్వీసులను అప్పగించడం, వ్యాప్కోస్‌ ఇచ్చే తుది డీపీఆర్‌ కోసం ఎదురుచూడకుండానే అంచనాల తయారీకి ఆదేశించడం, అంచనాలను ఆమోదించడం – అదికూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం లేకుండా– నీటిని నింపేందుకు ఆదేశాలు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలకు లబ్ధికలిగేలా కండిషన్ల సవరణకు ఆదేశాలు, ఇలా అన్ని అంశాల్లో ముఖ్యమంత్రి పాత్ర ఉందని తెలిసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలో ఇచ్చిన సూచనలు, తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ మూడు బరాజ్‌లలో అక్రమాలు చోటు చేసుకుని, అన్ని సమస్యలకూ కారణమయ్యాయని పేర్కొంది.

అప్పటి ఆర్థిక మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి కమిషన్‌ ఎదుట హాజరైన సమయంలో ప్రభుత్వ విధానాన్ని అమలు చేసే బాధ్యత అధికారులదేనని చెప్పారని కమిషన్‌ పేర్కొన్నది. అది నిజమే కావచ్చని, కానీ.. ఈ కేసులో నీటి లభ్యత ప్రాతిపదికన అనే తప్పుడు కారణంతో బరాజ్‌ నిర్మాణ ప్రాంతాన్ని మేడిగడ్డకు మార్చడంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఈ విషయంలో నిపుణుల కమిటీ నివేదికను పక్కకు పెట్టి స్థల మార్పిడి జరిగిందని పేర్కొంది.

ప్రారంభం నుంచి మొదలుకుని, బరాజ్‌ల ఆరోగ్యంతో నిమిత్తం లేకుండా వాటిలో నీటిని నింపి ప్రారంభించే వరకూ అన్నీ అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జరిగాయని తెలిపింది. అప్పటి ఆర్థిక మంత్రి మౌనంగా సహకరించగా, ఇరిగేషన్‌ మంత్రి అప్పటి ముఖ్యమంత్రి కోరిక నెరవేర్చేలా అనుమతించారని నివేదిక పేర్కొంది. నిజానికి.. అప్పటి సీఎం.. రాజకీయ కార్యనిర్వాహకుడిగానే కాకుండా.. పరిపాలన కార్యనిర్వాహకుడిగా కూడా వ్యవహరించి.. ప్రభుత్వ పాలసీని అముల చేశారని తెలిపింది. అవి రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం చేకూర్చాయని పేర్కొన్నది. కనుక అప్పటి ముఖ్యమంత్రిపై చట్టానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉన్నదని స్పష్టంచేసింది. ఈ అక్రమాలకు కారణమైన, రాష్ట్ర నిధుల పట్ల నమ్మకాన్ని వమ్ము చేసిన అధికారులు.. ‘తప్పనిసరి పరిస్థితుల్లో మేం ఆ పని చేయాల్సి వచ్చింది’ అని తమను తాము కాపాడుకునే ప్రయత్నానికి అర్హులు కాదని, వారికి ఎలాంటి మినహాయింపు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. ఇందుకు కారకులైన అధికారులు చట్ట ప్రకారం కఠినశిక్షకు గురికావాల్సిందేనని స్పష్టంచేసింది. భవిష్యత్తులో రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి తప్పుడు నిర్ణయాలు తీసుకుండా గుణపాఠంలా, ఒక హెచ్చరికగా ఆ చర్యలు ఉండాలని అభిప్రాయపడింది. వీరి విషయంలో మానవతా కారణాలు సహా ఎలాంటి సడలింపులు ఇచ్చినా అది రాష్ట్ర సంక్షేమానికి భవిష్యత్తులో విపత్తుగా మారే అవకాశం ఉంటుందని కమిషన్‌ నివేదిక హెచ్చరించింది.

అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నిర్వహణ సరిగా లేదని తెలిపింది. ఆనకట్టల డిజైన్లు, డ్రాయింగ్స్ లో పూర్తిగా లోపాలున్నాయని కమిషన్ ప్రకటించింది. క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదన్నారు. మేడిగడ్డకు సబ్ స్టాన్షియల్ కంప్లీట్ సర్టిపికెట్ ఇవ్వడం అక్రమమని,బ్యాంకు గ్యారెంటీల విడుదల కూడ తప్పేనని కమిషన్ అభిప్రాయపడింది. ఎలాంటి పెనాల్టీ విధించకుండా కాంట్రాక్టు పొడిగించారని, కాంట్రాక్టర్ల లబ్దికే నాటి ప్రభుత్వ నిర్ణయాలు నిర్ణయాలు తీసుకున్నారని కమిషన్ అభిప్రాయపడింది.అప్పటి ఈఎన్‌సీ మురళీధర్ రావు అన్ని అంశాలు తొక్కిపెట్టారని కమిషన్ వివరించింది. నిపుణుల కమిటీ నివేదికను అప్పటి ముఖ్య కార్యదర్శి ఎస్ కే జోషి తొక్కి పెట్టారని కమిషన్ తెలిపింది.

 

Exit mobile version