Site icon vidhaatha

Nag Ashwin | సొంతూరు పాఠశాలకు నాగ్‌ అశ్విన్‌ ఆర్థిక సహాయం

ప్రశంసించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : కల్కీ సినిమా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తన సొంతూరు నాగర్‌ కర్నూల్‌ జిల్లా తాండూరు మండలం ఐతోలులో తన ఆర్థిక సహాయంతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల అదనపు గదులను స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్ సంతోష్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశం పేరును కల్కి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ మన నాగర్ కర్నూల్ బిడ్డ కావడం ఎంతో గర్వకారణం అన్నారు‌. చిన్న పల్లెటూరు నుంచి ప్రపంచానికి తన శక్తిని నిరూపించిన నాగ్ అశ్విన్‌ని యువత, విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సొంత ఊరికి సేవ చేయాలని భావిస్తున్న నాగ్ అశ్విన్, ఆయన కుటుంబీకుల త‌ప‌న‌ అభినందనీయ‌మ‌న్నారు. ఆర్థికంగా స్థోమత కలిగిన వ్యక్తులు సేవా భావాన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు.

తన తండ్రి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి స్వగ్రామం తూడుకుర్తిలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్ప‌త్రికి సొంతంగా 10 ఎకరాల భూమిని అందజేశారని, పేదల కోసం కళ్యాణ మండపం నిర్మించారని, తాడూరు ప్రభుత్వ కళాశాలకు మూడు ఎకరాల స్థలాన్ని, మెడికల్ కళాశాల విద్యార్థులకు బస్సును ఇచ్చారని గుర్తు చేశారు‌. 20 ఏళ్ల పాటు వైద్యునిగా సేవ‌లందించిన తాను నాన్న స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చి మీ అంద‌రి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేను అయ్యానని అన్నారు. ప్రజలకు జీవితాంతం సేవ చేస్తానన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ద్వారా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేట్‌ కంపెనీల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు నిధులు తీసుకొచ్చేలా చూస్తానన్నారు. ఐతోల్ గ్రామాన్ని కచ్చితంగా మండలంగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పాఠశాల పెండింగ్‌ పనులను త్వరలో పూర్తి చేస్తామని రాజేశ్ రెడ్డి తెలిపారు.

Exit mobile version