Urine | కొంత మంది విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. తమ స్కూల్లో చదివే ఓ బాలిక మంచి నీళ్ల బాటిల్‌లో మూత్రం కలిపారు. ఆ నీటిని ఆమె తాగగా.. ఆ దృశ్యాన్ని చూసి పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటన రాజస్థాన్ భిల్వారా జిల్లాలోని గవర్నమెంట్ సీనియర్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. భిల్వారా జిల్లాలోని లుహారియా గ్రామానికి చెందిన బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం తన బాటిల్‌ను తీసుకుని నీళ్లు తాగగా, దుర్వాసన వచ్చింది. తన వాటర్ బాటిల్‌లో మూత్రం కలిపారని ఆమె గ్రహించింది. అంతేకాకుండా లవ్ లెటర్ కూడా రాసి బ్యాగులో పెట్టారు. లవ్ యూ అని లెటర్‌లో రాసి ఉంది. ఈ విషయాన్ని బాధిత బాలిక ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లింది. కానీ ప్రిన్సిపల్ స్పందించలేదు. పాఠశాల వదిలిన తర్వాత ఇంటికెళ్లిన బాలిక తనకు జరిగిన అవమానంపై తల్లిదండ్రులకు తెలిపింది.
సోమవారం ఉదయం పాఠశాల తెరవగానే అక్కడికి చేరుకున్న పేరెంట్స్ ఆందోళనకు దిగారు. మంచినీళ్ల బాటిల్‌లో మూత్రం కలిపిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ స్పందించకపోవడంతో.. బాటిల్‌లో మూత్రం కలిపిన విద్యార్థుల ఇండ్లపై బాధితురాలి పేరెంట్స్, ఇతరులు దాడులకు పాల్పడ్డారు.
ఈ ఉద్రిక్త పరిస్థితులపై పోలీసులు స్పందించారు. బాధితురాలు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. రాళ్ల దాడికి పాల్పడిన వ్యక్తులపై కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. ఒక వేళ ఇరు వర్గాలు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేపడుతామని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి ఫిర్యాదులు అందనప్పటికీ లుహారియా గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు భారీగా మోహరించారు.