క‌విత బెయిల్ విచార‌ణ వాయిదా

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ విచార‌ణను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 4కి వాయిదా వేసింది

  • Publish Date - April 1, 2024 / 03:35 AM IST

విధాత : ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ విచార‌ణను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 4కి వాయిదా వేసింది. ఆమె తరుపు న్యాయవాది బెయిల్ కోరుతూ.. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ ఉందని, అందుకే ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌ను ఏప్రిల్ 4కి వాయిదా వేసింది. మధ్యంతర లేదా తాత్కాలిక బెయిల్‌ ఇవ్వాలని కవిత తరఫు న్యాయావాది అభిషేక్‌ మను సింఘ్వి కోరగా.. ఎలాంటి బెయిల్‌ కావాలో ముందుగా నిర్ణయించుకోవాలని కోర్టు సూచించింది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో కవితను మార్చి 15, 2024న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను ఏప్రిల్‌ 9 వరకు జ్యుడిషియల్‌ కస్టడీకి కోర్టు పంపింది. కవిత బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసేందుకు, ఆధారాలను తారుమారు చేసేందుకు అవకాశం ఉన్నందున ఆమెను జైలుకు పంపాలని ఈడీ కోరింది. ఆమెను విడుదల చేస్తే ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తు ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది. అయితే.. ఈ కేసు రాజకీయ దురుద్దేశాలతో పెట్టినదని కవిత ఆరోపిస్తున్నారు. ఈ తప్పుడు కేసులో తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ లికర్‌ షాపుల లైసెన్సుల కోసం ఆప్‌ నేతలకు కవిత ముడుపులు ముట్టజెప్పారన్న ఆరోపణ ఎదుర్కొంటున్నారు.

Latest News