Site icon vidhaatha

Kavitha Suspended From BRS : బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్

BRS party suspended MLC Kavitha for her activities against party

Kavitha Suspended From BRS | విధాత, హైదరాబాద్ : కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై అసమ్మతి గళం వినిపిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నాయకత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు..కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందునా పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నదని.. పార్టీ అధ్యక్షులు కే.చంద్రశేఖర రావు ఎమ్మెల్సీ కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ కుమార్ ల పేరుతో ప్రకటన విడుదల చేశారు.

పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వరంగల్ లో పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా పార్టీ విధానాలను ప్రశ్నిస్తూ తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడంపై పార్టీ నాయకత్వంపై ఆమె తొలిసారిగా గళమెత్తారు. పార్టీలో, కేసీఆర్ చుట్టు దెయ్యాలున్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాతా కేటీఆర్ నాయకత్వ శైలిపైన, మాజీ ఎంపీ సంతోష్ రావుపైన పరోక్షంగా విమర్శలు చేశారు. పార్టీకి చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపైన కూడా కవిత విమర్శలు చేసింది. అనంతరం సింగరేణి బోగ్గుగని కార్మిక సంఘం నుంచి కవితను బీఆర్ఎస్ తప్పించింది.

తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరిన నేపథ్యంలో మాజీ మంత్రి టి.హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై నేరుగా కవిత విమర్శలు గుప్పించారు. తన తండ్రి కేసీఆర్ కాళేశ్వరం నిర్మాణంలో తప్పు చేయలేదని..జరిగిన తప్పులకు ..కేసీఆర్ కు అవినీతి మరకలు అంటడానికి మాజీ మంత్రి టి.హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులే కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర అలజడి రేపింది. బీఆర్ఎస్ ఎల్పీ నుంచి, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఖాతాల నుంచి కవితను అన్ ఫాలో చేయాలని పార్టీ ఆదేశించడం..కవిత పీఆర్వోను వాటి నుంచి తొలగించడం చకచకా జరిగిపోయాయి.

ఆ తర్వాతా ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో కవిత వ్యాఖ్యలపైన, కాళేశ్వరంపై సీబీఐ విచారణ పరిణామాలపైన సోమవారం నుంచి మంగళ వారం మధ్యాహ్నం వరకు కూడా కేసీఆర్, కేటీఆర్, సహా ఆ పార్టీ ముఖ్యనేతలు తీవ్రంగా సమాలోచనలు చేశారు. సుధీర్ఘ చర్చల అనంతరం కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కేసీఆర్ కూడా అంగీకరించడంతో.. కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. కాగా బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత కొత్త రాజకీయ పార్టీ పెడుతారని..తెలంగాణ జాగృతి పేరుతో పార్టీ ప్రకటిస్తారని తెలుస్తుంది.

Exit mobile version