Kavitha Demands Cancellation Of Group-1 | గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాల్సిందే : జాగృతి అధ్యక్షురాలు కవిత

గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, పరీక్షలను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారే కూలదోస్తారని హెచ్చరించారు.

Kavitha demands cancellation of group-1 exam

విధాత, హైదరాబాద్ : గ్రూప్ – 1 పరీక్షల్లో అక్రమాలతో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని..పరీక్షలను వెంటనే రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద చేపట్టిన ధర్నాలో ఆమె మాట్లాడారు. గ్రూప్ 1 అభ్యర్థులకు ధైర్యం ఇవ్వాలని మేము గన్ పార్క్ ధర్నా నిర్వహించామని.. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలని తెలంగాణ జాగృతి టీజీపీఎస్సీ ముట్టడి చేసినప్పటికి ప్రభుత్వంలో చలనం లేదు అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి కానీ , బోగస్ ఉద్యోగాలు ఇవ్వొద్దు అన్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగి, వారినే మోసం చేశారు అని కవిత ఆరోపించారు. ఎన్నికల హామీ జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రిలీజ్ చెయ్యలేదు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ఇచ్చిన నోటిఫికేషన్ లోని పాత ఉద్యోగాలు ఇచ్చి, కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాము అని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. గ్రూప్ 1 పరీక్షను తప్పుడుగా నిర్వహించారని..గ్రూప్ 1 పరీక్ష రద్దు అయ్యే వరకు ప్రభుత్వం మెడలు వంచేందుకు ఉద్యమం చేస్తామన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు మౌనం వీడాలని.. గ్రూప్ 1 పరీక్ష పై హరగోపాల్ వంటి వారు మాట్లాడాలిని..తాను కూడా అవసరం అయితే ఆయనను కలుస్తానని చెప్పారు.

నిరుద్యుగులే ఈ సర్కార్ ను కూలదోస్తారు

రాహుల్ గాంధీ మాటలు నమ్మి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని, నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కులగొడుతారు అని హెచ్చరించారు. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతను జాగృతం చేస్తామని తెలిపారు. తెలంగాణ తెచ్చుకుందే నియామకాల కోసం అని, ఉద్యోగ నియామకాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 నియామకాల్లో ప్రెసిడెంటల్ ఆర్డర్ ద్వారా 8 మంది ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అని ఆరోపించారు. ప్రెసిడెంటల్ ఆర్డర్ పైన మేము ఉద్యమం చేస్తాం అని కవిత తెలిపారు.