విధాత : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మెదక్ జిల్లాలో జనం బాట కార్యక్రమం కొనసాగిస్తున్నారు. నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో కాళేశ్వరం ప్యాకేజీ 18 కాల్వ పనుల పరిశీలించి, రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులతో భేటీ అయ్యారు. ఘనపూర్ ఆనకట్ట సందర్శించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ ఇక్కడ మూడు రకాల అంశాలు నా దృష్టికి వచ్చాయని, ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన సర్వేను మార్చారని, హైటెన్షన్ వైర్లు, రైల్వే లైన్ విషయంలో కూడా అదే విధంగా చేశారని తెలిపారు. నిర్వాసితుల పొలాలు,ఇళ్లకు సరైన ధరలు ఇవ్వటం లేదు అన్నారు. సరైన ధర వస్తేనే సంతకం పెడతామని రైతులు అంటున్నారని, మీ సోదరిగా చెబుతున్నా. మీరు మాట్లాడినవి అన్ని న్యాయమైన విషయాలేనన్నారు.
పైగా ఇదే జిల్లాలో మల్లన్న సాగర్ నిర్వాసితులు ఇక్కడ భూములు కొనుక్కున్నారు. వారి భూములు మరోసారి పోయే పరిస్థితి ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రెండు సార్లు ప్రాజెక్ట్ లల్లో భూములు పోయే వాళ్లకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుదామన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ లో పెద్దల వాళ్ల భూములను కాపాడే విధంగా సర్వేను ఇష్టానుసారంగా మార్చుతున్నారని కవిత విమర్శించారు. ప్రాజెక్ట్ లలో భాగంగా కళాకారులు, పేదవాళ్ల ఇళ్లు పోతున్నాయని తెలిసిందన్నారు. వాళ్లకు అన్యాయం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఇది రాజకీయం కాదు. ఇప్పుడు ఓట్లు లేవు. రైతులకు మంచి చేయాలనే నేను వచ్చాను అని తెలిపారు. మీ సమస్య కోసం అవసరమైతే హైదరాబాద్ లో పోరాడుదాం అని, అవసరమనుకున్న రోజు ఆర్ఆర్ఆర్ సమస్య పై ఎవరినీ కలువాలో వారిని కలుద్దాం అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యపై నిన్న హైదరాబాద్ లో ఎండీని కలిసి సమస్య వివరించాం అని గుర్తు చేశారు
