హైదరాబాద్ : ఎట్టకేలకు ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. కోదండరాం (Kodandaram), అమీర్ అలీఖాన్ (Ameer Alikhan) చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు అమీర్ అలీఖాన్.
పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా కోదండరాం పదవీ విరమణ..
ప్రొఫెసర్ కోదండరాం పూర్తి పేరు ముద్దసాని కోదండరాంరెడ్డి (Muddasani Kodandaram Reddy). మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం నెన్నెల్ గ్రామంలో వెంకటమ్మ, జనార్దన్‌రెడ్డి దంపతులకు 1955 సెప్టెంబర్ 5న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. పౌరహక్కుల ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన కోదండరాం తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీల పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ఏర్పాటైన టీజేఏసీకి కన్వీనర్‌గా వ్యవహరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ జనసమితి పేరుతో ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు.
పాత్రికేయ వృత్తిలో అమీర్ అలీఖాన్..
ఇటీవల మృతి చెందిన సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడైన అమీర్ అలీఖాన్ (Ameer Alikhan) 1973 అక్టోబర్ 18న హైదరాబాద్‌లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పొందిన ఆయన 1994 నుంచి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రముఖ ఉర్దూ పత్రిక సియాసత్ విస్తర్ణకు ఎంతగానో కృషి చేశారు. పాత్రికేయ వృత్తిలో భాగంగా పలు జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లను కవర్ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గార్లు, పలువురు ఎమ్మెల్సీలు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీలు ,, కోదండరాం , అమీర్ అలీఖాన్ లకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్