MLA Komatireddy Rajgopal Reddy : నిరుద్యోగుల డిమాండ్ సరైందే

నిరుద్యోగుల డిమాండ్ సరైందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Komatireddy Rajgopal Reddy

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలనే నిరుద్యోగుల డిమాండ్ సరైందేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు ఆయన గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీఅడియాతో మాట్లాడారు. గ్రూప్-1 జరిగిన అవకతవకలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ను గద్దె దించడంలో యువత కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగులకు తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యమంత్రిపై, పార్టీ నాయకత్వంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారశైలి కాంగ్రెస్ నాయకత్వానికి తలనొప్పులు తెచ్చి పెడుతోంది. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించకున్నా మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం చేయవద్దని ఆయన కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు తీసుకెళ్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీలో చేర్చుకొనే సమయంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తనకు మంత్రి పదవి ఇస్తారని ఇచ్చిన హామీ గురించి ఆయన సమయం దొరికినప్పుడు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.