విధాత : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజంగానే మేలు చేసి ఉంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేదని, కానీ ఓటమి భయంతో ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాల ప్రభుత్వ ఆలోచనను తప్పుబట్టారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి ఎన్నికలకు వెళ్లకుండా, నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేస్తూ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు పెడితే రైతులు తగిన బుద్ధి చెబుతారనే భయం ముఖ్యమంత్రిలో ఉందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఎన్నికలు పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు,వార్డ్ మెంబర్ల అభినందన సభలో కేటీఆర్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ‘420’ హామీలను అమలు చేయలేక, ప్రజలకు ముఖం చూపలేక సహకార ఎన్నికల నిర్వహణ నుండి తప్పించుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయదారులు, కూలీలు ప్రభుత్వంపై తీవ్ర కోపంతో ఉన్నారని, ఆ ప్రభావం ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతు బంధు, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయల భరోసా వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు. ఈ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్ పై నిరాధారమైన కేసుల లీకులు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
కేసులపై లీకులు కాదు…నేరుగా చెప్పండి
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కేసుల పేరుతో వెనుక నుండి లీకులు ఇవ్వడం మానేసి, నేరుగా కెమెరా ముందుకు వచ్చి ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని కేటీఆర్ సవాల్ విసిరారు. హోం మంత్రి కూడా ఆయనే కాబట్టి, ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలని, శిఖండి రాజకీయాలు చేయడం తగదని విమర్శించారు. ప్రజా ప్రయోజనాల కంటే కేవలం కేసుల చుట్టూనే ప్రభుత్వాన్ని తిప్పుతున్నారని, కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల దృష్టి మళ్లించడానికి కేసులు..నోటీసుల డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, రైతు బంధు వంటి హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ముఖ్యమంత్రి ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు.
కృష్ణా జలాలపై ముఖ్యమంత్రి, మంత్రుల అజ్ఞానం
కృష్ణా నదీ జలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులఅజ్ఞానంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యంగా సాగునీటి శాఖా మంత్రికి నీళ్లపై కనీస అవగాహన లేదని, ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో నీళ్ల గురించి అడిగిన ప్రశ్నలకు “నేను ప్రిపేర్ అయి రాలేదు, రేపు వచ్చి సమాధానం చెప్తాను” అని తప్పించుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మరో మంత్రిని ఉద్దేశించి “వాటర్ లో నీళ్లు” అని మాట్లాడే అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలు, సాగునీటి అవసరాలు తెలియని వారు అడ్డదారిలో అధికారంలోకి వచ్చి హుంకరిస్తున్నారని, అబద్ధాలు చెప్పి గందరగోళం సృష్టించడం తప్ప వీరికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం అశ్రద్ధ చేస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేస్తే, మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయలేక ఈ రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీపీఆర్ (DPR) పంపడంలో విఫలమవడమే కాకుండా, ప్రాజెక్టుల పరిధిని కుదిస్తూ తెలంగాణ ప్రయోజనాలకు గండికొడుతున్నారని విమర్శించారు.
కేసీఆర్ గర్జిస్తే సమాధానం లేదు
నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని కేటీఆర్ ప్రకటించారు. సాగునీటి అంశంపై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్ ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమ్మేళనంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డితో, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, చిరుమర్తి లింగయ్య, కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, నాయకులు చెరుకు సుధాకర్, ఒంటెద్దు నరసింహ రెడ్డిలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Telangana Check Dam Blast : చెక్ డ్యాంల పేల్చివేత నిజమే : నిజనిర్ధారణ కమిటీ
Harish Rao : జీవోలపై గోప్యత పై హైకోర్టు తీర్పు చెంపపెట్టు
