KTR vs Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ మరో సవాల్

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పతనానికి నాంది అని సిరిసిల్ల సభలో పేర్కొన్నారు.

KTR vs Revanth Reddy

విధాత : గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 66 శాతం ప్రజలు మద్దతునిచ్చారని సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం..దమ్ముంటే..వెంటనే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. శుక్రవారం సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ ల అభినందన సభలో కేటీఆర్ మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మేం కోర్టులో, స్పీకర్ కు ఫిర్యాదు చేశామని, అయితే స్పీకర్ మాత్రం వారు బీఆర్ఎస్ లోనే ఉన్నారని తేల్చడం విడ్డూరమన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి స్వయంగా కాంగ్రెస్ లో చేరామని బహిరంగంగా ప్రకటించారని..ఇప్పుడు స్పీకర్ ముందు మాత్రం బీఆర్ఎస్ లో ఉన్నామని అబద్దాలు చెప్పారని..దీంతో స్పీకర్ కూడా అన్ని ఆధారాలు ఉన్నప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు అబద్దాల ఆధారంగా తీర్పు ఇచ్చారని కేటీఆర్ విమర్శించారు. 10మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీనో చెప్పుకొలేక అబద్దాలు ఆడుతున్న దుస్థితి చూస్తే నవ్వాల్నో, ఎడ్వాల్నో తెలియడం లేదన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, బీఆర్ఎస్ సాధించిన విజయాలు చూస్తే రైతులు, బీసీలు, యువత కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నట్లుగా తేలిపోయిందన్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంకేతమన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన గెలుపు దెబ్బకు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణపై రేవంత్ రెడ్డి వెనకడుగు వేస్తున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

జనవరిలో పార్టీ కమిటీల ఏర్పాటు

ప్రభుత్వం ఓటమి భయంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ వాయిదా వేసుకున్నట్లయితే..జనవరిలో పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ చేపడుతామని కేటీఆర్ తెలిపారు. పోరాడే స్పూర్తి ఉన్న యువకులతో పాటు అనుభవజ్ఞులను కూడా కలుపుకుని రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి కొత్త కమిటీలు వేసుకుందామని తెలిపారు. జనవరిలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారని కేటీఆర్ వెల్లడించారు.
సిరిసిల్ల ప్రజలు కేసీఆర్ మీద నమ్మకంతో..నియోజవర్గంలో 117పంచాయతీల్లో 80 గ్రామాల్లో గులాబీ జెండా ఎగరవేసినందుకు సిరిసిల్ల జిల్లా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని కేటీఆర్ తెలిపారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు అయిపోయినందునా…పగలు, పంచాయితీలు పక్కనబెట్టి అందరూ గ్రామాల్లో కలిసి ఉండాలన్నారు. గెలిచిన సర్పంచ్ లను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రయత్నం చేస్తారని, అటువంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఒక వేళ ప్రభుత్వం మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పెడితే..సిరిసిల్ల నియోజకవర్గంలోని 57ఎంపీటీసీలు, 5జడ్పీటీసీలను గెలుచుకునేందుకు సమన్వయంతో పోరాడాలని కేటీఆర్ కేడర్ ను కోరారు.

ఇవి కూడా చదవండి :

Shruti Haasan | కత్తిలాంటి చూపులతో కట్టిపడేస్తున్న శ్రుతి హాసన్
Gen Z Post Office | యువత కోసం కర్ణాటకలో జెన్‌ జీ పోస్టాఫీస్‌..

Latest News