KTR FMAE | హైదరాబాద్‌ ఫార్ములా–ఈ రేస్‌ తెలంగాణను ప్రపంచ పటంపై నిలబెట్టింది: కేటీఆర్‌

హైదరాబాద్‌ ఫార్ములా–ఈ రేస్‌ తెలంగాణను గ్లోబల్‌ మ్యాప్‌పై నిలబెట్టిందని కేటీఆర్‌ అన్నారు. రూ.700 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు, మహిళా సాధికారత, టెక్నాలజీ అభివృద్ధి — ఇవన్నీ తెలంగాణ భవిష్యత్తుకు పునాది అని తెలిపారు.

KTR delivering keynote speech at FMAE National Student Motorsports Competition 2025 in Coimbatore

HYDERABAD’S FORMULA E RACE PLACED TELANGANA ON GLOBAL MAP, SAYS KTR
హైదరాబాద్‌:

KTR FMAE | భారత్‌లో తొలి ఫార్ములా–ఈ ఎలక్ట్రిక్‌ రేస్‌ను హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించడం ద్వారా తెలంగాణను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌, క్లీన్‌ మొబిలిటీ, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ హబ్‌గా నిలబెట్టామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ (KT Rama Rao) అన్నారు.

తమిళనాడులోని కొయంబత్తూరులో శుక్రవారం జరిగిన 10వ FMAE నేషనల్‌ స్టూడెంట్‌ మోటర్‌స్పోర్ట్స్‌ కాంపిటీషన్‌ 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ — “హైదరాబాద్‌ ఫార్ములా ఈవెంట్‌ కేవలం ఒక రేస్‌ కాదు, అది తెలంగాణకు దిశా నిర్దేశం,” అని పేర్కొన్నారు. ప్రపంచంలో వేగవంతమైన ఎలక్ట్రిక్‌ కార్లు హైదరాబాద్‌ వీధుల్లో పరిగెత్తిన రోజు, భవిష్యత్తుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ప్రపంచానికి తెలియజేసింది. ఆ ఈవెంట్‌ ద్వారా దాదాపు రూ.700 కోట్ల ఆర్థిక కార్యకలాపాలు సృష్టించబడ్డాయి. హైదరాబాద్‌ సాంకేతిక సామర్థ్యాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని కేటీఆర్‌ వివరించారు.

మొబిలిటీ వ్యాలీ దిశగా తెలంగాణ

“ఫార్ములా–ఈ రేస్‌ కేవలం ఆరంభం మాత్రమే,” అని కేటీఆర్‌ అన్నారు. “అదే పునాది మీద, త్వరలో హైదరాబాద్‌ ‘ఇండియా మొబిలిటీ వ్యాలీ’గా అవతరించనుంది. మేము దీర్ఘకాలిక, సుస్థిర, సాంకేతికాధారిత పరిశ్రమాభివృద్ధి దిశగా పయనిస్తున్నాం,” అని వివరించారు.

“T-Hub నుంచి T-Works వరకు — ఆవిష్కరణకు తెలంగాణ ఉదాహరణ”

తెలంగాణ స్టార్టప్​ ఎకోసిస్టమ్​ గురించి మాట్లాడుతూ — “ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌ ఇన్క్యుబేటర్‌ అయిన T-Hub, భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్‌ సెంటర్‌ అయిన T-Works — ఇవి తెలంగాణ సృష్టించిన ప్రగతి రథాలు” అన్నారు.
“మీరు చాయ్‌ తాగుతున్నంతలోనే, ఒక ఆలోచన T-Hub నుంచి T-Works వరకు చేరవచ్చు,” అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.

యువతకు కేటీఆర్‌ ప్రేరణాత్మక సందేశం

దేశవ్యాప్తంగా వచ్చిన వందలాది యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, మోటర్‌స్పోర్ట్స్‌ అభిమానులను ఉద్దేశించి కేటీఆర్‌ మాట్లాడుతూ —
“అవకాశాల కోసం ఎదురుచూడకండి, మీరు స్వయంగా అవకాశాలు సృష్టించండి. లైన్లో నిలబడకండి, మీరే కొత్త లైన్‌ మొదలుపెట్టండి. మీరు ఉద్యోగాల కోసం వెతకకుండా, ఉద్యోగాలు సృష్టించే వారుగా మారండి,” అని ప్రేరణాత్మకంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఎవరూ నమ్మలేదు. కానీ 11 ఏళ్లలోనే తాము అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచామని, ఇది నమ్మకం, సహనం, దూరదృష్టిల శక్తి అని ఆయన గుర్తుచేశారు.

“Impact over Income, Authenticity over Authority”

“మీరు మరింత చురుకైన, బాధ్యతాయుతమైన, జాగ్రత్తగల తరం. మీరు భారత్‌ భవిష్యత్తు సారథులు,” అని కేటీఆర్‌ అన్నారు. “మీరు ఆదాయాన్ని మాత్రమే కాకుండా, ప్రభావం చూపించండి,  నిజాయితీతో ముందుకు సాగండి — అదే నిజమైన విజయ పథం,” అని సూచించారు. చివరగా ఆయన Formula 1 ఆంగ్ల సినిమా నుంచి ఓ పంక్తిని ఉటంకిస్తూ — Hope is not a strategy. Create your own breaks, పరిశ్రమల్లోనైనా, పాలనలోనైనా, జీవితంలోనైనా విజయాలు యాదృచ్ఛికంగా రావు. వాటిని ఆలోచనలతో రూపుదిద్దాలి, ధైర్యంతో అమలు చేయాలి. ఇదే భవిష్యత్తు నిర్మాణమంటూ కేటీఆర్‌ నవతరపు యువకులకు స్ఫూర్తివంతమైన సందేశం ఇచ్చారు.