Site icon vidhaatha

Warangal: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయి: బండి సంజ‌య్‌

Law and order in the state: Bandi Sanjay

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్‌లో మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలతోపాటు, ప్రీతి ఘటనకు నిరసనగా వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, పార్టీ కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో పూటకో అత్యాచారం, రోజుకో హత్య జరుగుతున్నా సీఎం స్పందించడం లేదు. మెడికో స్టూడెంట్ ప్రీతిది ముమ్మాటికీ హత్యే. ఆమె కుటుంబ సభ్యులే చెబుతున్నారు. అయినా దీనిని చిన్న కేసుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

హైదరాబాదులో నిరసన దీక్ష

మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు నిరసనగా సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ‘‘నిరసన దీక్ష’’ చేస్తున్నట్లు సంజయ్ ప్రకటించారు. ఈ క్యాండిల్ ర్యాలీలో బిజెపి హన్మకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, పార్టీ నేతలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

పోచమ్మ మైదాన్‌లో ఫ్లెక్సీల తొల‌గింపు.. బీజేపీ కార్య‌క‌ర్త‌ల ధ‌ర్నా

బండి సంజయ్ రాక సందర్భంగా పోచమ్మ మైదాన్ సెంటర్లో బిజెపి కట్టిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీనికి నిరసనగా బిజెపి కార్యకర్తలు కొద్దిసేపు ధర్నా చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే ఫ్లెక్సీలు తొలగించారని బిజెపి నాయకులు కుసుమ సతీష్ విమర్శించారు.

Exit mobile version