విధాత : గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ నుంచి 2.52 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో స్పిల్‌వే ద్వారా 1.69 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 24,201 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్టు 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్టు ద్వారా 1300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం 316.71 మీటర్లకు నీరు చేరింది. అదేవిధంగా ప్రాజెక్టులో 9.65 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.34 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహారాష్ట్రలోని ఆల్మట్టి నుంచి 2.25 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. 2.75 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా కర్ణాటకలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 2.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో30.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 33.313 టీఎంసీలు. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. ఇన్ ఫ్లో 2,54,700 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 31,784క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 854.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 90.5596 టీఎంసీలుగా ఉంది. కుడి, విద్యుత్ కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి మొదలుకాలేదు. ఎడమ విద్యుత్తు కేంద్రం లో 31,784 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. నాగార్జున సాగర్‌లో 6500క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టడం 590అడుగులకు గాను 504.10అడుగులు, 312.05టీఎంసీలకుగాను 121.87టీఎంసీలుగా నీటి నిల్వలున్నాయి.