Site icon vidhaatha

వడివడిగా కృష్ణమ్మ,జూరాలకు పరుగులు .. గోదావరి పరివాహకంలో భారీ వర్షాలు

అల్మట్టి..నారాయణపూర్ గేట్ల ఎత్తివేత
సాగర్ ఆయకట్టులో చిగురిస్తున్న ఆశలు

విధాత, హైదరాబాద్ : ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదలతో కృష్ణా నది ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఎగువన కృష్ణా బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండు కుండలా మారాయి. అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 2500 క్యూసెక్కుల వరద వస్తుండగా, 7,500క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తు జల విద్యుత్తు ఉత్పర్తి చేస్తున్నారు. జూరాల పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.14 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.987 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ కుడి, ఎడమల కాలువలతో పాటు నెట్టెంపాడు‌, భీమా ఎత్తిపోతల‌ పథకానికి సాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయంలోలకి 70వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుకున్నది. దీంతో అధికారులు 68,920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 492.25 మీటర్లు కాగా ప్రస్తుతం 491.27 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 33. 31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 31.09 టీఎంసీలుగా ఉంది.

సాగర్ ఆయకట్టు రైతాంగంలో ఆశలు

అల్మట్టి ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లతో జలాశయంలో 92,736 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. పూర్తి సామర్థ్యం 129 టీఎంసీలకు ఇప్పటికే నిల్వ 100 టీఎంసీలు దాటింది. దీంతో దిగువకు 65 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్‌ జలాశయం పూర్తి సామర్థ్యం 37 టీఎంసీలు కగా, ప్రస్తుతం 30 టీఎంసీలకు చేరింది. కృష్ణానదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతోంది. 49,522 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3,585 క్యూసెక్కుల వరద వచ్చింది. శ్రీశైలంలో 808అడుగులే ఉన్నప్పటికి జల విద్యుదుత్పత్తిని ప్రారంభించి 25,500లకుపైగా క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 33.62 టీఎంసీలున్నాయి. నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీలకు.. ప్రస్తుతం కనిష్ట స్థాయి 121 టీఎంసీలున్నాయి. కనిష్ట నీటి మట్టం 510అడుగులైతే ప్రస్తుతం 504అడుగులుగా ఉంది. 21,481 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 550క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదవుతోంది. దీంతో ఏపీ తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి 9 రోజుల పాటు 5,000 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదలను బుధవారం నుంచి ప్రారంభించారు. ఎగువ నుంచి కృష్ణమ్మ వరద ప్రవాహం పెరుగుతూ ఇప్పటికే అల్మట్టి, నారాయణపూర్‌లు పూర్తి స్థాయికి చేరుకోవడం, తుంగభద్రలో సైతం 105టీఎంసీలకు36టీఎంసీల నీరు నిల్వలుండటం, కృష్ణా ఉప నదులు బీమా, కగ్ని సహా పలు ఉప నదుల్లో ప్రవాహం పెరుగుతుండటంతో ఈ నెలాఖరుకల్లా శ్రీశైలం నిండవచ్చన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఆయకట్టులో రైతులలో పంటల సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు సాగర్ జలాశయంకు కృష్ణమ్మ పరవళ్ల కోసం ఎదురుచూపులు పడుతున్నారు.

గోదావరి ప్రాజెక్టులకు వరద

గోదావరి బేసిన్‌లోని ఎగువ మహారాష్ట్రతో పాటు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో వాగులు, వంకలు పొంగుతూ క్రమంగా నదిలో వరద ప్రవాహం పెరుగుతుంది. నిజమాబాద్‌, ములుగు, అదిలాబాద్‌, ఏటూరునాగారం, మంగపేట, బోథ్‌, భద్రాచలం, అసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, భూపాలపల్లి ప్రాంతాల్లో వర్షాలతో వరద తాకిడి పెరుగుతుంది. జంపన్న వాగు, బొగత, కుంటాల, పొచ్చెర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాణహిత నుంచి50వేల క్యూసెక్కులు వస్తుండగా, మేడిగడ్డ నుంచి దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్‌ ప్రాజెక్టుకు 4,500 క్యూసెక్కుల వరద వస్తోండగా, ప్రాజెక్టు సామర్థ్యం 80.5 టీఎంసీలకు ప్రస్తుతం 14టీఎంసీలుగా ఉంది. కడెం ప్రాజెక్టుకు 3,442 క్యూసెక్కులు, ఎల్లంపల్లి, సింగూరుకు 391 క్యూసెక్కుల వరద రికార్డయింది. సుందిళ్లకు 331 క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 9,500 క్యూసెక్కులు, మేడిగడ్డ బ్యారేజీకి 49,500 క్యూసెక్కులు, సమ్మక్కసాగర్‌(తుపాకులగూడెం)కు 78,450 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. సీతమ్మసాగర్‌(దుమ్ముగూడెం)కు 94 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి 68 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. సమక్క బ్యారేజీ, తాలిపేరు నుంచి నీటి విడుదలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ భారీగా పెరుగుతోంది. స్నాన ఘట్టాలపైకి వరద నీరు చేరుకుంది. గురువారం నాటికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 25-30 అడుగులకు మధ్య కొనసాగుతుంది. దిగువన ఇంద్రావతి, సీలేరు నుంచి పెరుగుతున్న ప్రవాహంతో దవళేశ్వరం వద్ధ 87వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది.

Exit mobile version