ఈనెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ
అదే రోజు రైతు వేదికల్లో సంబరాలు
భూమి పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ
సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
విధాత, హైదరాబాద్ : రైతుల 2లక్షల రుణమాఫీ మార్గదర్శకాలపై నెలకొన్న అపోహలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. భూమి పాస్ పుస్తకం ఆధారంగానే రైతు కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టుకున్నామన్నారు. ఈనెల 18న రూపాయలు లక్ష వరకు రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అదే రోజు రైతు వేదికల్లో రైతు రుణమాఫీపై లబ్ధిదారులతో సంబరాలు నిర్వహించనున్నట్లుగా రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రైతు రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు ఆదేశాలిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై చర్చించారు. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందుగానే లక్ష పరిమితి వరకు ఉన్న రుణాలను జూలై 18వ తేదీలోపునే మాఫీ చేస్తామని చెప్పడంతో రైతుల్లో హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి.