విధాత, హైదరాబాద్ : మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్‌తో కలిసి మరో కీలక నేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. బండి ప్రకాశ్ పేరిట ఉన్న రూ.20లక్షల రివార్డును, పుల్లూరి ప్రసాదరావుపై ఉన్న రూ.25లక్షల రివార్డును వారికి అందించారు. ఈ సందర్బంగా మావోయిస్టుల లొంగుబాటు వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. 1980లో పుల్లూరి ప్రసాదరావు కిషన్‌జీకి అనుచరుడిగా మారారు. 1981లో పీపుల్స్‌వార్‌లో చేరి.. 1983లో కమాండర్ అయ్యారు. 1992లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2008లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. 17 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా..పార్టీ సిద్దాంతకర్తగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుతో పుల్లూరి ప్రసాదరావు లొంగిపోయారు అని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.
మరో మావోయిస్టు నేత బండ ప్రకాశ్ అలియాస్ ప్రభాత్.. 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో మావోయిస్టు పార్టీలో పనిచేశారని శివధర్ రెడ్డి తెలిపారు. అతని స్వస్థలం తెలంగాణలోని మందమర్రి. ఏడో తరగతి చదువుతున్నప్పుడే నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. సికాస కార్మిక సంఘం అధ్యక్షుడిగా, మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2004లో వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో జరిగిన శాంతి చర్చల్లో ప్రకాశ్ పాల్గొన్నారు. 2019లో స్టేట్ కమిటీ సభ్యుడయ్యారు. నేషనల్ పార్క్ ఏరియా కీలక ఆర్గనైజర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
మావోయిస్టు పార్టీలో తెలంగాణ వారు మరో 64మంది
మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన ఇంకా 64 మంది మావోయిస్టులు కొనసాగుతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది తెలంగాణలో 427 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. అందులో 8 మంది రాష్ట్ర కమిటీ, మరో ఇద్దరు కేంద్ర కమిటీ మెంబర్లు లొంగిపోయారు. ప్రస్తుతం పార్టీలో ఉన్నవారిలో 9 మంది మాత్రమే తెలంగాణలో, మిగిలిన వారు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. సెంట్రల్ కమిటీలో 5 మంది తెలంగాణ మావోయిస్టులు ఉన్నారు. 10 మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నట్లు తెలిపారు. 20 మంది డిస్ట్రిక్ కమిటీ, 14 మంది ఏరియా కమిటీల్లో, 10 మంది తెలంగాణ కమిటీలో ఉన్నట్లు గుర్తించినట్లుగా వెల్లడించారు. పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టు నేతలపై ఎలాంటి చట్టపర చర్యలు ఉండవని, అసరమైతే.. వారికి రక్షణ కల్పిస్తాం అని డీజీపీ తెలిపారు.
