CPI ML Kothapalli Ravi : మారేడుమిల్లి ఎన్కౌంటర్ బూటకం

మారేడుమిల్లి ఎన్కౌంటర్ బూటకమని, సుప్రీం కోర్ట్ జడ్జి పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ నేత కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు.

CPI ML Mass Line Kothapalli Ravi

విధాత, వరంగల్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరిసీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ముమ్మాటికీ భూటకమని సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. ఈ ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం హన్మకొండలో జరిగిన ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుత్త పెట్టుబడి దారులు, సామ్రాజ్యవాదుల కోసం భారత సైన్యంచే దేశ పౌరులను వేటాడి చంపడం రాజ్యాంగ ఉల్లంగానే కాకుండా, అప్రజాస్వామ్య చర్యగా అభివర్ణించారు. మోడీ, అమిత్ షా లు అదాని,అంబానీ లకోసం మధ్య భారతం లోని ఖనిజలకోసం నక్సలైట్ల ఏరివేత పేరిట రక్తపు టేరులుపారిస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసులను ఆడవుల్లో నుండి వెళ్లగొట్టే కుట్ర తో ఆదివాసీ హనన లక్ష్యంగా మారణకాండ సాగిస్తున్నారని విమర్శించారు.

ప్రజలు,బుద్దిజీవులు,హక్కుల సంఘాలు ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని, మావోయిస్టు పార్టీ తో శాంతి చర్చలు జరపాలనే డిమాండ్ చేస్తున్నా చర్చల ప్రక్రియకు నిరాకరించడం సిగ్గుచేటన్నారు. మారేడుమిల్లి అడవుల్లో బూటకపు ఎన్కౌంటర్ లో అమరులైన మడావి హిడ్మా, హేమ, రాజే, మరో నలుగురి మృతి పై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అమరులకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నామన్నారు. ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని రవి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు చిర్ర సూరి, పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు, నాయకులు అర్షం అశోక్, మైదం పాణి, సాబిరి కానీ మోహన్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest News