Medak | మెదక్ బంద్ ప్రశాంతం.. 9 మంది అరెస్టు

జిల్లా కేంద్రమైన మెదక్‌లో శనివారం రాత్రి, ఇరువర్గాలు రాళ్ళు.. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు

  • Publish Date - June 17, 2024 / 09:33 AM IST

ఐజీ రంగనాథ్ పర్యవేక్షణలో మెదక్‌లో భారీ బందోబస్తు
అన్ని కుడలిల వద్ద పోలీస్ పీకేట్
మెదక్ ఘటనపై.. డిజిపితో మాట్లాడిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి
9 మంది అరెస్టు.. అల్లర్లకు పాల్పడిన 45 మంది గుర్తింపు
మీడియా సమావేశంలో ఐజీ రంగనాథ్
పోలీస్ దిగ్బంధనం మెదక్

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: జిల్లా కేంద్రమైన మెదక్‌లో శనివారం రాత్రి, ఇరువర్గాలు రాళ్ళు.. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్‌ల వైపల్యానికి నిరసనగా బీజేపీ, బీజేవైఎం ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాలు ఆదివారం మెదక్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార, వాణిజ్య వర్గాలు మూసివుంచారు. ఐజీ రంగనాథ్ పర్యవేక్షణలో మెదక్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎస్పీ బాలస్వామి, ఏఎస్పీ మహేందర్, డీఏస్పీ రాజేష్ ల ఆధ్వర్యంలో మెదక్‌లో పోలీస్ పీకెట్ ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన చౌరస్తాలలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవాలయాలు, మసీదుల వద్ద పోలీస్ పీకేట ఏర్పాటు చేసి పట్టణంలో పోలీసుల పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఐజీ రంగనాథ్ మెదక్‌లోనే మకాం వేసి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఐజీ రంగనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అల్లర్లకు పాల్పడిన 45 మందిని గుర్తించామ‌ని, నిందితులు ఏ పార్టీ వారైన వదిలే ప్రసక్తే లేదన్నారు ఐజీ రంగనాథ్. పోలీస్‌ల వైపల్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయని ఐజీ ప్రకటించారు.

మెదక్ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి ఆరా!

మెదక్‌లో శనివారం రాత్రి ఇరువర్గాలు ఘర్షణపై పార్టీ వర్గాల ద్వారా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజ‌య్ ఆరాతీశారు. అనంతరం డీఐజీతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మెదక్ ఘటనపై నిష్పక్షపాతంగా పోలీస్‌లు వ్యవహరించాలని డిఐజీతో మాట్లాడినట్టు తెలుస్తుంది. మెదక్‌లో ఆదివారం బంద్ సంపూర్ణంగా జరిగింది.

9 మంది అరెస్టు..

మెదక్ అల్లర్ల ఘటనలో 9 మందిని పోలీస్‌లు ఆదివారం అరెస్టు చేశారు. మెదక్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌తో పాటు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాయిని ప్రసాద్, మరో 7గురు మొత్తం 9 మందిని పోలీస్‌లు అరెస్టు చేశారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరు పరచగా జడ్జి 9 మందికి 14 రోజుల రిమాండ్ విధించింది. వారిని జిల్లా జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా పోలీస్‌లు ఏకపక్షంగా వ్యవహరించి కేవలం ఒక వర్గానికి చెందిన నాయకులనే అరెస్టు చేస్తున్నారని భజరంగ్ దళ్ పట్టణ అధ్యక్షులు అప్పల సురేష్, హిందూ సంఘాలు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు.

Latest News